Independence Day 2021 Telangana: అదే జరిగితే దేశమంతా కుప్పకూలుతుంది.. గోల్కొండలో కేసీఆర్ ప్రసంగం హైలెట్స్

గణతంత్ర్య వేడుకలను సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నారు. ఇవాళ (ఆగస్టు 15) ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ త్రివర్ణ పతాకాన్ని గోల్కొండ వేదికగా ఎగరవేయనున్నారు.

ABP Desam Last Updated: 15 Aug 2021 01:46 PM
అదే జరిగితే దేశం కుప్పకూలుతుంది: కేసీఆర్

‘‘కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ దళిత ప్రజలు దుర్భర పేదరికంలో బతుకుతున్నారన్నది నగ్న సత్యం. మన రాష్ట్రంలో కూడా అంతే జరుగుతోంది. దళిత జాతిని దారిద్ర్యం ఒక్కటే కాదు.. సామాజిక వ్యత్యాసం కూడా వారిని వేధిస్తోంది. దేశంలో ఇలాంటి ఒక పెద్ద ప్రజాసమూహాన్ని అణచివేస్తే దేశమంతా కుప్పకూలుతుందనే విషయం గ్రహించాలి. దేశంలో వీలైనంత తొందరగా అసమానతలను రూపుమాపాలి. దళితు ఎదుగుదలకు అది మొదటి సోపానం కావాలి.’’ అని కేసీఆర్ అన్నారు.

త్వరలోనే పెద్దాస్పత్రులకు శంకుస్థాపన: కేసీఆర్

హైదరాబాద్ నలుదిక్కులా టిమ్స్ పేరుతో నాలుగు మల్టి స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తాం. ఎల్బీ నగర్, అల్వాల్, సనత్ నగర్‌లలో కూడా టిమ్స్ ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం భూ సేకరణ పనులు కూడా పూర్తయ్యాయి. రామగుండం, పటాన్ చెరు పారిశ్రామిక వాడలో మల్టి స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించనున్నాం. త్వరలో వీటికి సంబంధించిన శంకుస్థాపన చేస్తాం. వరంగల్‌లో ఇప్పటికే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి చర్యలు ప్రారంభించాం. ఈ ఆస్పత్రుల వల్ల అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు ఒకే గొడుగు కిందికి వస్తాయి’’ అని కేసీఆర్ అన్నారు. 

దేశం కంటే తెలంగాణ తలసరి ఆదాయమే రెట్టింపు: కేసీఆర్

‘‘2013 -2014 తెలంగాణ ఏర్పడిన నాడు రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.4,51,580 కోట్లు. కోవిడ్ ఉత్పాతం ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తీవ్ర అవరోధాలను సృష్టించినప్పటికీ 2020-2021 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9,80,407 కోట్లుగా నమోదైంది. అదే విధంగా రాష్ట్రం ఏర్పడిన నాడు 2013-2014 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,12,126 ఉండగా నేడు తెలంగాణ రాష్ట్ర  తలసరి ఆదాయం రూ.2,37,632కు చేరుకుంది. నేడు మన దేశ తలసరి ఆదాయం రూ.1,28,829గా నమోదైంది. దేశ తలసరి ఆదాయం కంటే, తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉండటం విశేషం. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో పదికి మించి పార్లమెంట్ స్థానాలున్న పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే.. తలసరి ఆదాయంలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను.’’ అని కేసీఆర్ ప్రసంగించారు.

“రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా” తెలంగాణ

‘‘ఉమ్మడి రాష్ట్రంలో మన అవసరాల కోసం కానీ, పేదలకు రేషన్ బియ్యం పంపిణీ కోసం కానీ ఎక్కడెక్కడి నుంచో పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి బియ్యం దిగుమతి అయ్యేది. అవి తినడానికి కూడా పనికొచ్చేది కాదు. కానీ, ఈ రోజు ఇక్కడి రైతన్నలు కేవలం తెలంగాణకే కాదు, దేశంలోని ప్రజలందరికీ కడుపు నిండా అన్నం పెడుతున్నారు. తెలంగాణ “రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా” అవతరించింది. 



శ్రీశ్రీ రాసిన పాటను గుర్తు చేసిన సీఎం

‘‘స్వాతంత్రం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయ్.. సాధించిన దానికే సంతృప్తిని చెంది అదే విజయమని అనుకుంటే పొరపాటోయ్’’ అని మహాకవి శ్రీశ్రీ రాసిన పాటను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పటికీ దీన్ని మనం అన్వయించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మరింత నిబద్ధత నిజాయతీ నిండిన ద్రుక్పథంతో దేశ ప్రజలు పునరంకితం కావాలని కేసీఆర్ కోరారు.



అమర వీరులందరికీ నివాళులు: సీఎం

‘‘స్వాతంత్ర అమర వీరులను యావత్ భారతావని గుర్తు చేసుకుంటోంది. వారందరికీ నివాళులు అర్పిస్తున్నాను. మనం సాధించి ఏమిటి? ఇంకా సాధించాల్సిందేమిటన్నది మదింపు చేసుకోవాలి. దేశం అనేక రంగాల్లో పురోగతి సాధించింది. ఇంకా కనీస అవసరాల కోసం జనం కొట్టుమిట్టాడుతున్నారు.’’ అని సీఎం తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు.

జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

గోల్కొండ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతానికి గౌరవ సూచకంగా సెల్యూట్ చేశారు. అంతకుముందు గోల్కొండకు చేరుకున్న కేసీఆర్‌కు పలువురు కళాకారులు ఘన స్వాగతం పలికారు.



గోల్కొండ కోటకు చేరుకున్న కేసీఆర్

75వ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ గోల్కొండ కోటకు చేరుకున్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తరపున కళాకారులు సీఎంకు కేసీఆర్ స్వాగతం పలికారు. జెండా ఆవిష్కరణ అనంతరం సీఎం కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంతకుముందు కేసీఆర్ ప్రగతి భవన్‌లో జెండావందనం చేశారు.

ప్రగతి భవన్‌లో జెండా ఎగరేసిన కేసీఆర్

ప్రగతి భవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఎగరవేశారు. మహనీయుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. దేశానికి వారు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు, ప్రగతి భవన్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎగరవేశారు. భారతమాతకి జై, వందేమాతరం, భోలో స్వతంత్ర భారత్‌కు జై అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ బండి సంజయ్ కుమార్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎంపీ సాయం బాబూరావు, పార్టీ  వ్యవహారాల సహా ఇంచార్జ్ ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, బీజేపీ తెలంగాణ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీఆర్ఎస్-బీజేపీ కార్యకర్తల బాహాబాహీ

స్వాతంత్ర దినోత్సవం రోజు మల్కాజ్ గిరి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్-బీజేపీ నాయకుల మధ్య బాహాబాహీ చోటు చేసుకుంది. మల్కాజ్ గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి సమక్షంలోనే కార్యకర్తలు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఆ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై దాడి చేసి కెమెరా, ఫోన్‌లను లాక్కుని పరారయ్యారు.

గాంధీ భవన్‌లో జెండా ఎగరేసిన రేవంత్

అబిడ్స్‌లోని నెహ్రు విగ్రహం నుంచి గాంధీ భవన్ వరకు టీపీసీసీ స్వతంత్ర మార్చ్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాస్కి, వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, పొన్నాల, పొన్నం, అజ్మతుల్లా తదితరులు పాల్గొన్నారు. అనంతరం గాంధీ భవన్‌లో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండాను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎగురవేశారు.



ప్రోటెం స్పీకర్ జెండా ఆవిష్కరణ

75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో శాసన మండలి ప్రోటెం ఛైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు డాక్టర్ అంబేడ్కర్ విగ్రహానికి, మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు.



ముందుగా అమరవీరుల స్తూపం వద్దకు కేసీఆర్..

స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వద్ద సైనిక వీరుల స్మారకం వద్ద అమరులకు నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి గోల్కొండ కోటకు చేరుకుంటారు. కోటలోని రాణిమహల్ లాన్ గార్డెన్‌లో ఉదయం 10.30కి ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఆ తర్వాత పోలీసు బలగాల గౌరవ వందన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగిస్తారు.

Background

75వ స్వాతంత్ర్య దినోత్సవానికి గోల్కొండ కోట ముస్తాబయింది. ఇవాళ (ఆగస్టు 15) ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ త్రివర్ణ పతాకాన్ని గోల్కొండ వేదికగా ఎగరవేయనున్నారు. తెలంగాణ ఆవిర్భావం అయిన నాటి నుంచి స్వాతంత్ర్య దినోత్సవాన్ని గోల్కొండ కోటలో నిర్వహిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. గణతంత్ర్య వేడుకలను సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల క్రితమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ గోల్కొండను సందర్శించి అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. గతేడాది మాత్రం కరోనా ముఖ్యమంత్రి ప్రగతి భవన్‌లోనే జెండా వందనం చేసిన సంగతి తెలిసిందే.


Also Read: Weather Updates: కొనసాగుతున్న అల్పపీడనం.. రెండ్రోజుల్లో తెలంగాణకు భారీ వర్షాలు.. ఏపీలో కూడా..

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.