Nicholas Pooran Stunning Fifty: ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు లక్నో సూపర్ జెయింట్స్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. గతేడాది హైదరాబాద్ లో ఎదురైన ఘోర పరాజయానికి బదులు తీర్చుకుంది. గురువారం ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో 5 వికెట్లో లక్నో స్టన్నింగ్ విక్టరీ సాధించింది. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ బ్యాటర్లు అనుకున్నంతగా రాణించలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగలను ఆరెంజ్ ఆర్మీ చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (28 బంతుల్లోనే 47, 5 ఫోర్లు, 3 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లో లార్డ్ శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. మిగతా బౌలర్లంతా ప్రణాళిక బద్ధంగా బౌలింగ్ చేసి సన్ బ్యాటర్లను కట్టడి చేశారు. అనంతరం లక్నో టార్గెట్ 16.1 ఓవర్లలో 5 వికెట్లకు 193 పరుగులు చేసి, పూర్తి చేసింది. వన్ డౌన్ బ్యాటర్ నికోలస్ పూరన్ (26 బంతుల్లో 70, 6 ఫోర్లు, 6 సిక్సర్లు)తో విధ్వంసం సృష్టించాడు. 18 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టాడు. కెప్టెన్ పాట్ కమిన్స్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. ఈ విజయంతో ఈ సీజన్ లో లక్నో బోణీ కొట్టగా, హైదరాబాద్ కు తొలి ఓటమి ఎదురైంది.
బ్యాటర్లు విఫలం.. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. 15 పరుగులకే అభిషేక్ శర్మ (6), సెంచరీ హీరో ఇషాన్ కిషాన్ డకౌట్ తో వికెట్లను కోల్పోయింది. ఈ దశలో హెడ్ ఎదురుదాడికి దిగి కాస్త పరిస్థితిని చక్కదిద్దాడు. తెలుగు హీరో నితీశ్ కుమార్ రెడ్డి (32)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే ఫిఫ్టీకి చేరువైన దశలో హెడ్ ఔటయ్యాడు. ఆ తర్వాత క్లాసెన్ (26) అన్ లక్కీ గా ఔటవగా, నితీశ్ ను రవి బిష్ణోయ్ పెవిలియన్ కు పంపాడు. ఈ క్రమంలో అనికేత్ వర్మ (36) సిక్సర్లతో హంగామా చేశాడు. చివర్లో కమిన్స్ (18) 3 సిక్సర్లతో జట్టు పోరాడగలిగే స్కోరును సాధించింది.
పూరన్, మార్ష్ జోడీ విధ్వంసం.. ఇక ఛేజింగ్ లో లక్నోకు ఆరంభంలోనే షాక్ తాకింది. ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ (1) త్వరగానే ఔటయ్యాడు. ఈ దశలో మరో ఓపెనర్ మిషెల్ మార్ష్ (31 బంతుల్లో 52, 7 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి, పూరన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ చెరో వైపు నుంచి సన్ బౌలర్లను వీర బాదుడు బాదారు. బంతి ఎటువైపు వేసిన బౌండరీకి తరలించడమే టార్గెట్ గా ఆడారు. ఈ దశలో కేవలం 18 బంతుల్లో పూరన్, 29 బంతుల్లో మార్ష్ ఫీఫ్టీలు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో రెండో వికెట్ కు 116 పరుగులు జోడించారు. దీంతో మ్యాచ్ లక్నో వైపు మొగ్గింది. అయితే పూరన్ , మార్ష్ త్వరగా ఔట్ కావడం మధ్యలో కెప్టెన్ రిషభ్ పంత్ (15), ఆయుష్ బదోనీ (6) వికెట్లు తీసి మ్యాచ్ ను సన్ బౌలర్లు ఆసక్తిగా మలిచారు. అయితే డేవిడ్ మిల్లర్ (13 నాటౌట్), అబ్దుల్ సమద్ (22 నాటౌట్) మ్యాచ్ ను త్వరగా ముగించారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో లక్నో ఖాతా తెరిచింది. అలాగే ఆరెంజ్ క్యాప్ ను పూరన్, పర్పుల్ క్యాప్ ను శార్దూల్ సాధించారు. ఈ రెండు ప్రతిష్టాత్మక క్యాప్ లు లక్నో ప్లేయర్ల వద్ద ఉండటం విశేషం.