HYDRA Commissioner Key Decision On Grievances: 'హైడ్రా' (HYDRA) కమిషనర్ రంగనాథ్ (Ranganath) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి సోమవారం నగర ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని నిర్ణయించారు. బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ, తిరిగి 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఫిర్యాదు చేసే ముందు తగిన ఆధారాలు, పూర్తి వివరాలతో రావాలని సూచించారు. దీనికి సంబంధించి ఏమైనా సందేహాలుంటే 040 - 29565758, 040 - 29560596 నెంబర్లను సంప్రదించాలన్నారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
అక్రమ నిర్మాణాలపై హైడ్రా కన్నెర్ర
అటు, హైదరాబాద్ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను సైతం పట్టించుకోకుండా ఇక్కడ 100 అడుగుల రోడ్డును ఆనుకొని 5 అంతస్తుల భవనాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారంటూ హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన అక్కడకు వెళ్లి పరిశీలించగా.. 684 గజాల స్థలంలో సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 5 అంతస్తుల్లో భవనం నిర్మాణంలో ఉంది. జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ అధికారులు ఇచ్చిన షోకాజ్ నోటీసులతో పాటు హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా భవనాన్ని నిర్మించడాన్ని రంగనాథ్ తీవ్రంగా పరిగణించారు. పూర్తి వివరాలు పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
హైడ్రా వార్షిక నివేదిక హైలైట్స్ ఇవే..
కాగా, ఇటీవలే హైడ్రా వార్షిక నివేదికను రంగనాథ్ విడుదల చేశారు. 5 నెలల అనుభవాలు, వచ్చే ఏడాది రూట్ మ్యాప్ సిద్దం చేసినట్లు రంగనాథ్ తెలిపారు. జీహెచ్ఎంసీ చట్టం కింద ప్రభుత్వం హైడ్రాకు ప్రత్యేక అధికారాలు ఇచ్చిందని.. 12 చెరువులు, 8 పార్కులను అన్యాక్రాంతం కాకుండా రక్షించినట్లు చెప్పారు. 1,095 చెరువుల్లో వచ్చే ఏడాది ఎఫ్‌టీఎల్ నిర్దారణ చేస్తామని.. సాంకేతిక పరిజ్ఞానంతో చెరువులకు సరిహద్దులు, బఫర్ జోన్లను నిర్ణయిస్తున్నామని పేర్కొన్నారు.
'త్వరలోనే ఎఫ్ఎం ఛానల్'
ఎఫ్‌టీఎల్‌ను పారదర్శకంగా చేయడం తమ బాధ్యతని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఎన్ఆర్ఎస్ఈతో సమన్వయం చేసుకుని శాటిలైట్ చిత్రాలు సేకరిస్తున్నామని.. ఏరియల్ డ్రోన్ చిత్రాలు సైతం తీసుకుంటామని చెప్పారు. శాటిలైట్ ఇమేజ్‌తో అత్యంత రెజల్యూషన్ ఉన్న డేటా తీసుకుంటున్నామని.. ప్రభుత్వ భూములకు జియో ఫెన్సింగ్ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. చెరువులకు సంబంధించి 2000 నుంచి 2024 వరకూ ఉన్న చిత్రాలు సేకరిస్తున్నామన్నారు.
శాస్త్రీయమైన పద్దతుల్లోనే ఎఫ్‌టీఎల్ నిర్దారణ జరుగుతుందని రంగనాథ్ పేర్కొన్నారు. ఇప్పటివరకూ హైడ్రాకు 5,800 వరకూ ఫిర్యాదులు అందాయని.. అనధికారిక నిర్మాణాలకు సంబంధించి 27 పురపారక సంఘాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని వివరించారు. శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా ఆక్రమణలను గుర్తిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు కాపాడడమే హైడ్రా ప్రధాన కర్తవ్యమని.. భూముల రక్షణతో పాటు వరద నివారణ చర్యలు సైతం చేపడతామని అన్నారు. హైడ్రా తరఫున ఒక ఎఫ్ఎం ఛానల్ త్వరలోనే పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నామని.. దాని ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం తెలిపేందుకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. హైడ్రా యాప్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు చెప్పారు.
Also Read: Telangana News: చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు