తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభమై 20 ఏళ్లు పూర్తయిన వేళ ఆ పార్టీ మరోసారి ప్లీనరీకి సిద్ధమైంది. నేడు ప్లీనరీ సమావేశం సోమవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరగనుంది. 2018 తర్వాత మూడేళ్లకు ఇది జరుగుతోంది. టీఆర్ఎస్ 13 ఏళ్లపాటు ఉద్యమం నడిపి, ఏడేళ్ల క్రితమే అధికారంలోకి వచ్చింది. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ ప్లీనరీ నిర్వహిస్తున్నారు. దీని కోసం బస్తీ నుంచి రాష్ట్ర స్థాయి వరకూ సంస్థాగత ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ప్లీనరీకి ప్రజాప్రతినిధులతో పాటు కొత్త సంస్థాగత కమిటీల ప్రతినిధులనూ ఆహ్వానించారు. 


రెండు దశాబ్దాల ఉత్సవాల సందర్భంగా వరంగల్‌లో వచ్చే నెల 15న విజయ గర్జన పేరిట భారీ బహిరంగ సభను కూడా టీఆర్ఎస్ తలపెట్టిన సంగతి తెలిసిందే. నేడు ఉదయం 11 గంటలకు ప్లీనరీ ప్రారంభమవుతుంది. తొలుత అమరవీరులకు కేసీఆర్‌ నివాళులర్పించి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు. పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రకటన, అనంతరం కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత పార్టీ రాజకీయ, జాతీయ, ప్రాంతీయ స్థాయి అంశాలపై కొన్ని తీర్మానాలు చేస్తారు. వీటిని ఏడుగురు వేర్వేరు నేతలు ప్రతిపాదిస్తారు. అనంతరం వాటిపై చర్చించి, ఆమోదించుకుంటారు. 


ఆహ్వానితులు వీరే..
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు, జడ్పీల ఛైర్‌పర్సన్లతో పాటు మండల పరిషత్‌ అధ్యక్షులు, జడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్ల స్థాయి వరకు అందరినీ ఆహ్వానించారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ఆరున్నర వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. పురుషులు, మహిళలు గులాబీ రంగు వస్త్రాలు ధరించి రావాలని పార్టీ అధిష్ఠానం నిర్దేశించింది. సభ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.


Also Read: పెళ్లైన రెండు నెలలకే భార్యను అమ్మేసిన భర్త.. ఆమెకు ఏం చెప్పి అమ్మాడో తెలుసా!


ట్రాఫిక్ ఆంక్షలు
సైబరాబాద్‌, రాచకొండ, హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలోని పోలీసు అధికారులకు బందోబస్తు విధులు కేటాయించారు. మరోవైపు, నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. హైటెక్స్‌ ప్రాంగణాన్ని తమ అధీనంలోకి తీసుకుని తనిఖీలు చేపట్టారు. ఆరుగురు డీసీపీలు, 26 మంది ఏసీపీలు, 70 మంది ఇన్‌స్పెక్టర్లు, 192 మంది ఎస్‌ఐలు, 40 మంది ఏఎస్‌ఐలు, 1,180 మంది హెడ్‌కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహిస్తారు. వీరు కాక మరో 750 మంది ట్రాఫిక్‌ పోలీసులు ఉంటారు. ఆదివారం సాయంత్రం హైటెక్స్‌లో పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశమైన సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర.. ప్లీనరీ సందర్భంగా పటిష్ఠ నిఘా ఉంచాలని ఆదేశించారు. పాసులున్న వారినే లోనికి అనుమతించాలని స్పష్టం చేశారు.


సభకు వచ్చే ప్రతినిధుల వాహనాల కోసం పార్కింగ్‌ స్థలాలను సిద్ధం చేశారు. దాదాపు 4 వేల వాహనాలు నిలిపేలా స్థలాన్ని చదును చేశారు. తమ వాహనాలను పార్కింగ్‌ ప్రాంతాల్లోనే నిలిపి హైటెక్స్‌ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. రహదారులపై రద్దీ నెలకొనకుండా పోలీసులు ప్రత్యేక రూట్‌మ్యాప్‌లు తయారు చేసి ట్రాఫిక్‌ సిబ్బందికి అందజేశారు.


Also Read: Match Box Price: అగ్గిపెట్టెల ధర పెంపు.. 14 ఏళ్ల తర్వాత రెట్టింపైన రేటు, కారణం ఏంటంటే..


Also Read: నల్గొండ జిల్లాలో విషాదం... ప్రేమను చంపుకోలేక ప్రాణాలు తీసుకున్నారు...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి