Telangana News: తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్‌ బాంబుల పేలుళ్లు ఎక్కువైపోతున్నాయి. ఏపీలో టీడీపీ, వైసీపీ బాంబులు పేలిస్తే ఇప్పుడు తెలంగాణ వంతు వచ్చింది. ఇక్కడ కూడా ఓ బాంబు పేలపోతోందని మంత్రి ప్రకటించడం సంచలనంగా మారింది. ఒకట్రెండు రోజుల్లో పొలిటికల్ బాంబు  పేలుతుందని సమాచారం ప్రసారాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. 


అసలు ప్రభత్వం ఏం చేయబోతోంది... శ్రీనివాస్ రెడ్డి చెబుతున్న ఆ బాంబు ఏంటనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. ఇది కచ్చితంగా కేసులు రిలేటెడ్‌గానే ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పారు. తప్పు చేసిన వాళ్లు తప్పించుకోలేరని వార్నింగ్ కూడా ఇచ్చారు. సాక్ష్యాధారాలతో ఫైళ్లన్నీ సిద్దమయ్యాయంటూ లీకు కూడా ఇచ్చేశారు. ఇదంతా చట్టం పరిధిలోనే ఉంటుందని కక్ష సాధింపులు అనుకోవద్దని కూడా క్లారిటీ ఇచ్చేశారు. 


ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్, ధరణి, కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. విచారణ కూడా చేపట్టింది. ఈ కేసుల్లో కొందరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది కూడా. విచారణలో వివిధ దశల్లో ఉన్న ఈ కేసుల విషయమే శ్రీనివాస్ రెడ్డి ప్రస్తావించి ఉంటారని అంటున్నారు. ఈ కేసుల్లో ఇప్పటి వరకు విచారణలో వెలుగు చూసిన అంశాలను అరెస్టు అయిన వాళ్లు ఇచ్చిన సమాచారంతో ముఖ్యనేతల పేర్లు ఉంటాయనే అనుమానం బలపడుతోంది. అదే ఈ బాంబు అని అంటున్నారు. 


ఏపీలో పేలిన పొలిటికల్ బాంబులు


ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసిన పొలిటికల్ బాంబు స్టేట్మెంట్‌ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చిందని అంటున్నారు ప్రజలు. ఏపీలో ఏం జరిగిందంటే.... గురువారం 12 గంటలకు పెద్ద పేలుడు జరగబోతోందని టీడీపీ అధికారిక ట్విటర్ హ్యాండిల్ నుంచి ఓ పోస్టు వచ్చింది. క్షణాల్లోనే అది వైరల్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరగబోతోంది ఎవరిపై ఆ బాంబు పడబోతోందన్న చర్చ మొదలైంది. అదే టైంలో తామూ రెండు బాంబులు పేలుస్తున్నామంటూ వైసీపీ తన అధికారి హ్యాండిల్ నుంచి పోస్టు పెట్టింది. వైఎస్‌ఆర్‌సీపీనే టీడీపీ టార్గెట్ చేసి ఏదో చర్చిస్తోందని గ్రహించి జాగ్రత్తపడింది. 


అంతే ఇరు వర్గాలు పొలికిటల్ బాంబులతో సోషల్ మీడియాను షేక్ చేశారు. అయితే గురువారం 12 గంటల వరకు అవసరం లేదని... రాత్రి 8 గంటలకే బాంబు వేయబోతున్నామని చెప్పిన టీడీపీ... అనుకున్నట్టుగానే పెద్ద బాంబు వేసింది. ఆస్తుల్లో వాటాలు ఇవ్వబోనంటూ షర్మిలకు జగన్ రాసిన లెటర్‌, తేల్చుకుందాం అంటూ షర్మిల ఇచ్చిన రిప్లైను సోషల్ మీడియాలో పెట్టింది. ఇప్పటికే ఇద్దరి మధ్య ఉన్న పొలిటికల్ పంచాయితీ కాస్త పంపకాల పంచాయితీగా మారింది. దీనిపై తెలుగు రాష్ట్రాన్నే కాకుండా జాతీయ మీడియా కూడా కథనాలు ప్రచురిస్తోంది. 


వైఎస్ కుటుంబంలో జరుగుతున్న అంతర్యుద్ధం ఇంకా కొనసాగుతుండగానే ఇటు తెలంగాణలో బాంబు పేలుస్తామంటూ మంత్రి చెప్పారు. దీంతో ఇక్కడ కూడా ఏం జరుగుతుందా అన్న ఆసక్తి జనంలో మొదలైంది. 


Also Read: నీ పనులతో ప్రేమ తగ్గిపోయింది- షర్మిలకు జగన్ రాసిన లేఖ ఇదే