YS Jagan Vs YS Sharmila : ఇన్ని రోజులు గుట్టుగా ఉన్న ఆస్తుల వివాదం మరింత రచ్చకెక్కింది. ఒకరిపై ఒకరు లేఖలతో మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. న్యాయపోరాటాలు చేస్తున్నారు. ఎందాకైనా అంటూ సవాళ్లు చేస్తున్నారు. అన్నాచెల్లెల మధ్య జరుగుతున్న ఈ ఆస్తుల తగాదాను చూస్తున్న సగటు వైఎస్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డల మధ్య ఉన్నది కేవలం రాజకీయ వారసత్వ పోరు అనుకున్నారు చాలా మంది. ఆస్తుల వివాదాలు ఉన్నాయని మీడియాలో కథనాలు వస్తున్నా ఇంకా చాలా మందిలో అదంతా ఫేక్ అని నమ్మేవాళ్లు లేకపోలేదు. అయితే జగన్ న్యాయపోరాటంతో గుప్పెట విప్పేశారు. నాలుగు గోడల మధ్య జరుగుతున్న ఆస్తుల అంతర్యుద్ధాన్ని బహిర్గతం చేశారు. 
అన్నాచెల్లెల మధ్య రాజీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రచారం ఈ మధ్య మళ్లీ మొదలైంది. ఆస్తుల పంపకానికి జగన్ ఓకే చెప్పారని కూడా వార్తలు లీకు అయ్యాయి. అలాంటిదేమీ లేదని ప్యాచ్‌ అయ్యే అవకాశమే లేదన్నట్టు వైఎస్‌ఆర్‌ శిబిరం నుంచి కౌంటర్ వచ్చింది. తల్లి విజయలక్ష్మి, చెల్లెలు షర్మిలపై చేస్తున్న న్యాయపోరాటానికి సంబంధించిన వివరాలు బహిర్గతమయ్యాయి. సర్వతి పవర్ అండ్ అండస్ట్రీలో గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చిన వాటాను ఉపసంహరించుకుంటున్నట్టు ఎన్‌సీఎల్‌టీలో వేసిన పిటిషన్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. 


జగన్ మోహన్ రెడ్డి ఎన్‌సీఎల్‌టీలో వేసిన పిటిషన్‌పై చర్చ జరుగుతున్న టైంలో మరో బాంబు పేలింది. ఈ పిటిషన్ వేయక ముందు జగన్ మోహన్ రెడ్డి రాసిన ఓ లేఖ బహిర్గతమైంది. తనను వ్యతిరేకిస్తున్న షర్మిలకు ఆస్తులు ఎందుకు రాయాలంటూ ప్రశ్నిస్తూ ఆ లెటర్‌ రాశారు. ఈ లెటర్‌ను జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 27న రాశారు. అయితే ఎన్‌సీఎల్‌టీ పిటిషన్‌కు ఆ లెటర్‌ జత చేయడంతో ఇప్పుడు వెలుగు చూసింది.  



వారసత్వంగా తండ్రి నుంచి వచ్చే ఆస్తులను ఆయన సమానంగా ఇద్దరికి పంచేశారు. అయితే తనకు వచ్చిన వాటాలను కష్టపడి తన తెలివితేటలతో వృద్ధి చేశానని చెప్పుకొచ్చిన జగన్ అందులో షర్మిలకు హక్కులేదని చెప్పేశారు. అయితే చెల్లెలు అన్న ప్రేమానురాగాలతో ఆ ఆస్తుల్లో కూడా వాటా ఇచ్చేందుకు అంగీకరించానని వెల్లడించారు. ఆస్తుల్ని బదిలీ చేసేందుకు గిఫ్టు డీడ్‌ కింద అమ్మ పేరిట రాశానని అన్నారు. న్యాయపరమైన చిక్కులు తొలగిపోయిన తర్వాత అవి నీ పేరు మీద బదిలీ అయ్యేవి. ఇవి కాకుండా చెల్లెలు అన్న ప్రేమతో చాలా సార్లు నేరుగా, అమ్మ ద్వారా 200 కోట్ల రూపాయలు ఇచ్చాను అని చెప్పుకొచ్చారు జగన్. 



ఇంతలా నీ కోసం ఇన్ని చేస్తే కృతజ్ఞత లేకుండా నన్ను వ్యతిరేకించావు అనేక మాటలు అన్నావు అని జగన్ అసహనం వ్యక్త చేశారు. వీటి కారణంగా చెల్లెలపై ప్రేమ తగ్గిపోయిందన్నారు జగన్. ఇకపై నీ ఆలోచనల్లో మార్పు వస్తే ప్రేమ పుడుతుందేమో అంటూ చెప్పారు. కోర్టు కేసులు పరిష్కారమయ్యాక ఆస్తులపై ఆలోచిస్తానంటూ వెల్లడించారు. అయితే ఇంతలో తన ఫ్యామిలీ గురించి(జగన్, భారతీ) అవినాష్ రెడ్డి గురించి ఎక్కడా మాట్లాడొద్దు, రాజకీయంగా వ్యతిరేకించవద్దని షరుతులు పెడుతూ జగన్ లేఖ రాశారు.  


దీనిపై షర్మిల ఘాటుగా స్పందించారు. తను ఎలా రాజకీయాలు చేయాలో, ఎలా మాట్లాడాలో నువ్వు డిసైడ్ చేయడం ఏంటని రిప్లై ఇచ్చారు. తన ఆస్తుల్లో మనవలూ మనవరాళ్లకు సమాన వాటా ఇవ్వాలని ఆనాడు తండ్రి చెప్పారని గుర్తు చేశారు. కానీ స్వార్థంతో అరకొర ఇస్తానని ఒప్పుకున్నా సరే అన్నానని తెలిపారు. అది కూడా ఇవ్వకుండా ఇప్పుడు తన కుటుంబాన్ని కోర్టుకు ఈడ్చడం ఎంత వరకు కరెక్టని ప్రశ్నించారు. అంతే కాకుండా ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడొద్దని నియంత్రించడం ఎంత సమంజసమని నిలదీశారు. షర్మిల లేఖపై పూర్తి కథనాన్ని ఇక్కడ చదవండి.


వైఎస్‌ కుటుంబంలో రగుతున్న ఆస్తుల అంతస్తుల వివాదాన్ని చూస్తున్న రాజశేఖర్ రెడ్డి అభిమానులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రాజన్న కుటుంబంలో ఎందుకిలా జరుగుతోందని చర్చించుకుంటున్నారు. 


Also Read: షర్మిల, విజయమ్మపై జగన్ న్యాయపోరాటం- సరస్వతిలో వాటాలు ఇవ్వడం లేదని పిటిషన్