Cyberabad police recovered 800 stolen and lost mobile phones worth Rs 2.40 crores | హైదరాబాద్: పోయిన సెల్ ఫోన్, లేక చోరీకి గురైన స్మార్ట్ ఫోన్ తిరిగి మీ చేతికొస్తే ఎలా ఉంటుంది. ఒకేసారి కొన్ని వందల మందికి అలాంటి అనుభవమే ఎదురైతే ఇలా ఉంటుందని సైబరాబాద్ పోలీసులు నిరూపించారు. కేవలం 35 రోజుల వ్యవధిలో చోరికి గురైన, పోగొట్టుకున్న రూ. 2.40 కోట్ల విలువైన 800 మొబైల్ ఫోన్‌లను సైబరాబాద్ పోలీస్ టీమ్ రికవరీ చేసింది.
సీఈఐఆర్ పోర్టల్‌ను వినియోగించుకుని రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను బుధవారం వారి ఓనర్లకు అప్పగించారు. సైబరాబాద్ కమిషనరేట్ ప్రధాన మీటింగ్ హాల్ లో అధికారిక కార్యక్రమం నిర్వహించి రూ.2.40 కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్‌లను వాటి యజమానులకు సైబరాబాద్ పోలీసులు అందజేశారు.

క్రైమ్ డీసీపీ డీసీపీ కె.నరసింహ ఐపీఎస్ మాట్లాడుతూ.. గత 35 రోజుల్లో 800 మొబైల్ ఫోన్‌లను సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. వాటిలో మాదాపూర్ సీసీఎస్ ద్వారా 135 సెల్ ఫోన్లు, బాలానగర్ సీసీఎస్ ద్వారా 140 స్మార్ట్ ఫోన్లు, మేడ్చల్ సీసీఎస్ ద్వారా 101 ఫోన్లు, రాజేంద్రనగర్ CCS ద్వారా 133 మొబైల్స్, శంషాబాద్ సీసీఎస్ ద్వారా 72 ఫోన్లు, మేడ్చల్ జోన్ ద్వారా 105 మొబైల్స్, IT సెల్ ద్వారా 101 స్మార్ట్ ఫోన్లను రికవరీ చేసినట్లు వెల్లడించారు. వీటిలో చోరీకి గురైన ఫోన్లతో పాటు పొరపాటున మరిచి పోగొట్టుకున్న స్మార్ట్ ఫోన్లు కూడా ఉన్నాయని సైబరాబాద్ పోలీసులు తెలిపారు.
సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయడానికి 1930కి డయల్ చేయాలని క్రైమ్ డీసీసీ సూచించారు. లేకపోతే అధికారిక పోర్టల్ http://cybercrime.gov.in ని సందర్శించి సెల్ ఫోన్లు చోరీకి గురైన వెంటనే ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. తద్వారా సాధ్యమైనంత త్వగార మొబైల్ లొకేషన్ ట్రేస్ చేసి, వాటిని రికవరీ చేసి బాధితులకు తమ ఫోన్లను అందజేసే అవకాశం ఉంటున్నారు.