Telangana News: బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరో లీడర్‌కు లీగల్ నోటీసులు పంపించారు. తన పరువుకు భంగం కలిగేలా మాట్లాడారని కేంద్రమంత్రి బండి సంజయ్‌కు లీగల్‌ నోటీసు పంపించారు. వారం రోజుల్లోపు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.


ఈ మధ్య కేంద్రమంత్రి బండి సంజయ్‌ మీడియాలో మాట్లాడుతూ కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌, డ్రగ్స్‌ వ్యవహారాల్లో ఆధారాలు లేని ఆరోపణలు చేశారని తన నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు వారం రోజుల్లో మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో డిమాండ్ చేశారు. లేకుంటే కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటానంటూ స్పష్టం చేశారు. 


కేటీఆర్ పంపిన లీగన్ నోటీసుపై వెంటనే కేంద్రమంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక కోర్టుల ద్వారా భయపెట్టాలని చూస్తున్నారంటూ విమర్శలు చేశారు. ఇలాంటివి చూస్తే జాలేస్తోందని ఎద్దేవా చేశారు బండి. 


మొదట తనపై ఆరోపణలు చేస్తేనే తాను రియాక్ట్ అయ్యాయని చెప్పుకొచ్చారు బండి సంజయ్. ఎవర్నీ ఏమీ అనలేదన్నట్టు సుద్దపూసలెక్క మాట్లాడుతున్నారని కేటీఆర్‌పై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మరోసారి ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసుల ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ కేసులు ఎందుకు సైడ్ అయిపోయాయో అందరికి తెలుసంటూ కామెంట్ చేశారు. కేటీఆర్ ఇచ్చే లీగల్ నోటీసుకు కోర్టు ద్వారానే సమాధానం చెప్తానని అన్నారు బండి..