Industrial Corridor In Lagacharla: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌, వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో భూసేకరణ రద్దు చేసి 24 గంటలకు గడవక ముందే ప్రభుత్వం మరో ట్విస్ట ఇచ్చింది. అక్కడ ఫార్మాక్లస్టర్ కోసం మాత్రమే భూసేకరణ రద్దు చేశామని తేల్చింది. పూర్తిగా అక్కడ భూసేకర ప్రక్రియ నిలిపివేయాలనే ఆలోచన లేదని తేల్చి చెప్పింది. పారిశ్రామిక కారిడార్ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. 


71 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్


లగచర్ల ఫార్మా క్లస్టర్‌ ఏర్పాటులో వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఇప్పుడు అక్కడే పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు సిద్ధమైంది. గత ఆగస్టులో ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వికారాబాద్ జిల్లా దూద్వాల్ మండలం,పోలేపల్లి గ్రామంలో 71 ఎకరాల 39 గుంటల భూమి సేకరించేందుకు ఈ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. 2013 చట్టం సెక్షన్ 6(2) కింద ఈ కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఫార్మా అంటే భయం, అనేక అనుమానలు ఉంటాయని అందుకే ప్రజలకు ఉపాధి కల్పించే పారిశ్రామిక కారిడార్‌కు ఎలాంటి అపోహలు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పారిశ్రామిక పార్క్‌ కోసం భూసేకరణ చేపట్టేందుకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. 


ఆగస్టు నుంచి ఆగమాగం 


తాండూరు సబ్‌ కలెక్టర్‌ను భూసేకరణ అధికారిగా నియమిస్తూ ఈ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం పరిధిలో దుద్యాల మండలంలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. దాదాపు 15 వందల ఎకరాలు సేకరణకు నోటిఫికేషన్ ఆగస్టులో ఇచ్చారు. తమ భూములు ఇచ్చేది లేదని రైతులు ఆందోళనకు దిగారు. ఆగస్టు నుంచి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ప్రజాభిప్రాయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న ప్రజలు నవంబర్‌ 11న లగచర్లలో జరిగిన గ్రామసభలో అధిరాలుపై దాడి చేశారు. రైతులతో మాట్లాడేందుకు అధికారులను పిలిచి దాడి చేశారని పోలీసులు గుర్తించారు. 


Also Read: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో వారికే తొలి ప్రాధాన్యత - అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు


అధికారులపై దాడితో విషయం దేశవ్యాప్తం  


లగచర్లలో అధికారులపై దాడి కేసులో బీఆర్‌ఎస్ నేతలపాత్ర ఉందని పోలీసులు తేల్చారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్టు చేశారు. ఆయనతోపాటు మరో 28 మందిని కూడా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. భూ వివాదంతో మొదలైన లగచర్ల ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఆగస్టు నుంచి వరసుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు గమనించిన ప్రభుత్వం... భూసేకరణ చట్టం 2013లోని సెక్షన్‌ 11 ప్రకారం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌ గజిట్‌ నెం.07/2024, తేదీ: 01-08-2024ను సెక్షన్‌ 93 ప్రకారం వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. 


ఇప్పుడు అదే ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో పర్యావరణానికి హాని ఉండబోదని, స్థానిక ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తోంది. దీనికి ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తుందని అనుకుంటుంది. 


Also Read: లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం