CM Revanth Reddy Review On Indiramma Houses: లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లపై (Indiramma Houses) ఆయన నివాసంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్య క్రమం ఎంచుకోవాలని తెలిపారు. తొలి దశలో సొంత స్థలాలున్న వారికే ప్రాధాన్యమిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయడం సహా అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్‌లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని.. ఏ దశలోనూ లబ్ధిదారుకు ఇబ్బంది కలగవద్దని.. అదే సమయంలో శాఖాపరంగా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలని నిర్దేశించారు.
ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా గదులు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపితే అందుకు అవకాశం కల్పించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం సమర్థమంతంగా కొనసాగించేందుకు వీలుగా గృహ నిర్మాణ శాఖ బలోపేతం కావాలని, ఇందుకు అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించుకోవాలని శాఖ ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాష్, ప్రత్యేక కార్యదర్శి వి.పి.గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు ఇజ్రాయెల్ టెక్నాలజీ
అటు, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ఇజ్రాయెల్ ముందుకు రావడంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ దేశ రాయబారి రువెన్ అజర్‌కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఇరుదేశాల మధ్య పరస్పర సహకారానికి ఇజ్రాయెల్ ఆసక్తి కనబర్చడం సంతోషంగా ఉందన్నారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీలో ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని.. ఆ రంగాల్లో తెలంగాణకు సహకరించాలని కోరారు. రక్షణ రంగం, వ్యవసాయం, నీటి వినియోగంలో ఆధునిక సాంకేతికత, కొత్త పరిశోధనలు, పారిశ్రామిక అభివృద్ధిలో తోడ్పాటు అందించాలన్న మంత్రి అభ్యర్థనకు ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజర్ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలో 200 ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తున్న విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబు ఇజ్రాయెల్ రాయబారి దృష్టికి తీసుకెళ్లారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీపై అత్యాధునిక శిక్షణలో మద్దతు ఇవ్వాలని కోరారు. వ్యర్థ జలాల పునర్వినియోగ సాంకేతికతలో తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేశామని.. ఇజ్రాయెల్ నుంచి పరిశ్రమలు పెట్టేందుకు ఏ సంస్థ ముందుకొచ్చినా నైపుణ్యం కలిగిన మానవ వనరులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.