Champions Trophy 2025 | న్యూఢిల్లీ: ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్‌కు వెళ్తుందా లేదా అనే అనుమానాలకు తెరపడింది. భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లడం లేదని భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. బీసీసీఐ చెప్పిన విషయాన్నే విదేశాంగశాఖ మరోసారి స్పష్టం చేసింది. పాకిస్తాన్‌లో భారత జట్టు పర్యటనపై విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ క్లారిటీ ఇచ్చారు. దాంతో పాకిస్తాన్ కష్టాలు రెట్టింపు కానున్నాయి. ఐసీసీ సూచనల్ని పాక్ క్రికెట్ బోర్డు పాటించక తప్పదు. భారత్ లాంటి జట్టు ఆడకపోతే పాక్ బోర్డు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
భారత్ నిర్ణయాన్ని స్పష్టం చేసిన విదేశాంగ శాఖ
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై ఐసీసీ సమావేశం జరగనున్న వేళ భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. భద్రతాపరమైన కారణాలతో భారత క్రికెట్ జట్టును పాకిస్తాన్‌కు తాము పంపించడం లేదని బీసీసీఐ ఇదివరకే ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది. భారత్ లాంటి అగ్రదేశం ఆడకపోతే ఛాంపియన్స్ నిర్వహణకు ఎలాంటి ఆదాయం, ప్రాధాన్యత రాదని భావించిన ఐసీసీ హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని భావిస్తోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (Pakisatan Cricket Board) మాత్రం హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించడం లేదు. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ తమ నిర్ణయాన్ని అధికారికంగా తెలిపింది.
హైబ్రిడ్ మోడల్ వ్యతిరేకిస్తున్న పీసీబీ చీఫ్
పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ మాత్రం భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్‌లో కాలుపెట్టదన్న బీసీసీఐ నిర్ణయం, భారత విదేశాంగ శాఖ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. హైబ్రిడ్ మోడల్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణను సైతం వ్యతిరేకించారు. ‘పాక్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టు వెళ్లుందా లేదా అనే విషయంపై ఇప్పటికే బీసీసీఐ స్టేట్‌మెంట్‌ను విడుదల చేసింది. భద్రతా సంబంధిత సమస్యలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కారణంతో తమ జట్టును పాక్‌కు పంపించడం లేదని స్పష్టం చేసింది. బీసీసీఐ నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. భద్రతా పరంగా లేవనెత్తిన అంశాలను మేం పరిగణనలోకి తీసుకున్నాం. కనుక భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లే అవకాశం లేదు’ అని రణ్‌ధీర్ జైశ్వాల్ వెల్లడించారు.
Also Read: IPL 2025 Auction: సంచలనాలు సృష్టించినా సైడ్ చేశారు, ఐపీఎల్‌లో అమ్ముడుపోని స్టార్ క్రికెటర్లు
అసలేంటీ హైబ్రిడ్ మోడల్.. పాక్‌కు కష్టమేంటీ?
ఏదైనా దేశంలో పూర్తిగా టోర్నమెంట్ నిర్వహించలేని పరిస్థితుల్లో పలు దేశాల్లో వేదికలు ఖరారు చేస్తూ మ్యాచ్‌లు నిర్వహించడాన్ని హైబ్రిడ్ మోడల్ అంటారు. ఉదాహరణకు వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. కానీ భద్రతా పరమైన కారణాలతో భారత క్రికెట్ జట్టు పాక్ వెళ్లేందుకు సిద్ధంగా లేదు. దాంతో భారత్ ఆడే మ్యాచ్‌లను శ్రీలంక, లేక భారత్ లలో నిర్వహించాల్సి ఉంటుంది. అంటే ఒకే దేశం వేదికగా కాకుండా రెండు లేక అంతకంటే ఎక్కువ దేశాలు మెగా ఈవెంట్ నిర్వహించడాన్ని హైబ్రిడ్ మోడల్ అంటారు.