Hyderabad News: దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రాత్మక నగరంగా అభివర్ణించిన భట్టి విక్రమార్క...ఈ నగరం ఒక ఐకాన్ గా పేరు గడించిందన్నారు. ఈ నగరాభివృద్ధిలో గత కాంగ్రెస్ ప్రభుత్వాల సేవలు మర్చిపోలేమన్నారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన నగర పారిశుద్ధ్య, మురుగు నీటి, తాగునీటి వ్యవస్థలు పదేళ్ళుగా నిర్లక్ష్యానికి గురైనట్టు విమర్శించారు. మితిమీరిన కాలుష్యంతో మూసీ, హుస్సేన్ సాగర్ విషతుల్యమయ్యాయి అన్నారు. మురికి నీటి కాలువల నిర్వహణ లోపంతో, ఆక్రమణలతో చినుకు పడితే నగరం జలమయమై నగరవాసులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. 


నగరు శివారుల్లో టౌన్‌షిప్‌లు


దూరదృష్టి లేని ప్రణాళికలు, ఇబ్బడిముబ్బడి అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించకపోవడంతో హైదరాబాద్‌ నగరాభివృద్ధిపై ప్రభావం చూపాయన్నారు తెలంగాణ ఆర్థిక మంత్రి . కేవలం కొన్ని ప్లై ఓవర్లు నిర్మించి దానినే అభివృద్ధిగా భ్రమింపజేశారని విమర్శించారు. హైదరాబాద్‌లో భూముల వేలం ద్వారా వేల కోట్లు సమకూరినా వాటి వినియోగం నగరాభివృద్ధిపై జరగలేదని అన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న పరిశ్రమల్లో, ఐటి సంస్థలు పని చేస్తున్న వాళ్లు రోజూ దూర ప్రయాణాలు చేస్తున్నారని అన్నారు. అలాంటి వారికి పనిచేసే ప్రాంతానికి దగ్గరగా నివాసాలు ఉంటే ప్రయోజనం ఉంటుందని ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుందని తెలిపారు. దీని వల్ల హైదరాబాద్ శివారుప్రాంతాలు కూడా వృద్ధి చెందుతాయన్నారు. శాటిలైట్ టౌన్ షిప్‌ల నిర్మాణం ప్రోత్సహించాలనేది తమ ప్రయత్నంగా వివరించారు. ఈ టౌన్ షిప్‌లలో పేద, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే ధరల్లో గృహాల నిర్మాణాలు ప్రోత్సహిస్తామన్నారు. టౌన్ షిప్‌లలో అన్ని రకాల సదుపాయాలు అంటే... పార్కులు, కమ్యూనిటీ హాలులు, వాణిజ్య సంస్థలు, పాఠశాలలు అన్నీ అందుబాటులో ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. 


Also Read: రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ - వివిధ రంగాలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి


పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు అభివృద్ధి


వీటితోపాటు హైదరాబాద్‌లో ఉన్న ట్రాఫిక్ సమస్యను తగ్గించే ఏర్పాట్లూ చేస్తామన్నారు ఆర్థికమంత్రి. ప్రైవేటు వాహనాల వినియోగం తగ్గించి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థని పటిష్టపరచడం ద్వారా కొంత వరకు సమస్యను అధిగమించే వీలుందన్నారు. దీనికి మెట్రో రైలు వ్యవస్థ అతి ముఖ్యమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం మూడు ట్రాఫిక్ కారిడార్లలో మెట్రో సౌకర్యం ఉందని.. రెండో దశ ప్రతిపాదనలను సమీక్షించి, వాటిని సవరించి, కొత్త ప్రతిపాదనలను రూపొందించామన్నారు. 


మెట్రోపై కీలక ప్రకటన 


వివిధ వర్గాల అవసరాలను తీర్చడంతోపాటు నగరంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో, ప్రభుత్వం 78.4 కిలోమీటర్ల పొడవు ఉన్న ఐదు ఎక్స్టెండెడ్ కారిడార్లను 24,042 కోట్ల రూపాయలతో అభివృద్ధి పరుస్తుందని తెలిపారు. మెట్రో రైలును ఓల్డ్ సిటీకి పొడిగించి దానిని శంషాబాద్ విమానాశ్రాయానికి అనుసంధానం చేస్తామన్నారు. ప్రస్తుతమున్న కారిడార్లను నాగోలు నుంచి ఎల్.బి.నగర్ వరకు విస్తరిస్తామని తెలిపారు. నాగోలు, ఎల్.బి నగర్, చంద్రాయణగుట్ట స్టేషన్లను ఇంటర్ చేంజ్ స్టేషన్లగా అభివృద్ధి చేస్తామన్నారు. 


Also Read:తెలంగాణ బడ్జెట్‌లో ఏ పథకాలకు ఎంత కేటాయించారంటే? 


Also Read: ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ - బడ్జెట్ సమావేశాలకు గులాబీ బాస్