KCR Attended First Time In Assembly: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. తెలంగాణ అసెంబ్లీలో (Telangana Assembly) గురువారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న క్రమంలో ఆయన సమావేశాలకు హాజరయ్యారు. బడ్జెట్‌ ప్రసంగం అయిన తర్వాత ఆయన చర్చలో పాల్గొంటారా.? లేదా.? అనే దానిపై స్పష్టత లేదు. నందినగర్‌లోని నివాసం నుంచి ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పూలవర్షం కురిపించారు. దాదాపు 7 నెలల తర్వాత అసెంబ్లీలో గులాబీ బాస్ అడుగుపెట్టగా.. గురువారం సమావేశాలపై అంతటా ఆసక్తి నెలకొంది. కాగా, ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై అటు అధికార, ఇటు విపక్ష సభ్యులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేద్దామని బుధవారం అసెంబ్లీ సమవేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పగా.. మాజీ మంత్రి కేటీఆర్ సైతం అందుకు సుముఖత వ్యక్తం చేశారు. 


కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన తొలి అసెంబ్లీ సమావేశాలకు గులాబీ బాస్ కేసీఆర్ హాజరు కాలేదు. ఎన్నికల అనంతరం తుంటి మార్పిడి శస్త్ర చికిత్స జరగ్గా.. అనారోగ్యంతో ఆయన హాజరు కాలేకపోయారు. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. అంతకు ముందు బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై పలు సూచనలు చేశారు.


కరీంనగర్‌కు బీఆర్ఎస్ నేతలు


గురువారం శాసనసభలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడగడ్డకు బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం లోయర్ మానేరు డ్యాం పరిశీలిస్తారు. అనంతరం రాత్రి రామగుండం చేరుకుని అక్కడే బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలన అనంతరం ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. అనంతరం మేడిగడ్డ సందర్శనకు బయలుదేరుతారు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. కాగా, రాష్ట్రంలో భారీ వర్షాల క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. మేడిగడ్డ వరదల నుంచి బయటపడిందంటూ ఇటీవల బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించగా.. దీనికి కాంగ్రెస్ నేతలు సైతం కౌంటర్ ఇచ్చారు.


కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ప్రాజెక్టులన్నీ ఖాళీగా ఉన్నా కాళేశ్వరం పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన చేపట్టినట్లు తెలిపారు.


Also Read: Telangana: తెలంగాణ ప్రజలకు తీపికబురు- గృహజ్యోతి దరఖాస్తులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కీలక ప్రకటన