Gruha jyothi: తెలంగాణ(Telangana) ప్రజలకు కాంగ్రెస్ మరో శుభవార్త తెలిపింది. అర్హత ఉండి ఇప్పటి వరకు గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకోని వారు ఏమాత్రం బాధపడాల్సిన పనిలేదని...ఇది నిరంతర ప్రక్రియ అని ఎప్పుడైనా అప్లయ్‌ చేసుకోవచ్చని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు.


గృహజ్యోతి పథకం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహజ్యోతి(Gruhajyothi) పథకంపై కీలక అప్‌డేట్‌ వచ్చింది. కాంగ్రెస్(Congress) ఇ‌చ్చిన ఐదు హామీల్లో ఒకటైన గృహజ్యోతి పథకం ఎప్పుడైనా ధరఖాస్తు చేసుకోవచ్చని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Batti Vikramarka) వెల్లడించారు. పథకానికి అర్హులైన వారు ఎప్పుడైనా అప్లయ్‌ చేసుకోవచ్చని ఇది నిరంతర ప్రక్రియ అని తేల్చి చెప్పారు. తెల్లరేషన్‌ కార్డు ఉండి 200 యూనిట్ల వరకు విద్యుత్ వాడే గృహాలన్నింటికీ జీరో బిల్లు ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అన్నట్లుగానే అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే గృహజ్యోతి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీనికోసం నేరుగా విద్యుత్‌శాఖ సిబ్బందే ఇంటింటికి వచ్చి రేషన్‌కార్డు, ఆధార్ ధృవపత్రాలు తీసుకుని అర్హులైన వారికి గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నారు. అయితే చాలామంది అర్హులకు ఇప్పటికీ ఈ పథకం అమలుకావడం లేదు. గ్రామీణప్రాంతాల్లో ఉండే నిరక్ష్యరాసులు తప్పుగా ఆధార్‌ నెంబర్లు చెప్పడం, కొంతమంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు చేసిన తప్పిదాల మూలంగా లక్షల మంది ఈ పథకాన్ని అందుకోలేకపోతున్నారు. గృహజ్యోతి పథకంపై చాలాచోట్ల నుంచి ఫిర్యాదులు అందడంతో మళ్లీ సవరణలు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. అయినప్పుటికీ ఇంకా చాలామందికి ఈ పథకం అందడం లేదు.  కొంతమంది ఇకా ఈ పథకానికి ధరఖాస్తు చేసుకోలేదు. వారందరికీ తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది.
నిరంతర ప్రక్రియ
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనమండలిలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. అర్హత కలిగిన వారు గతంలో దరఖాస్తు చేసుకోకపోతే...గ్రామీణ ప్రాంత ప్రజలు సమీపంలోని మండల కార్యాలయాల్లో, పట్టణాల్లో ఉన్నవారు డివిజన్ కార్యాలయాల్లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దీనికి నిర్థిష్టమైన గడువు ఏమీ లేదని...అర్హతే అసలు గడువని తేల్చి చెప్పారు.  ఈ దరఖాస్తులు నిరంతరం తీసుకుంటారన్నారు.200 యూనిట్లలోపు విద్యుత్ వాడే కుటుంబాలన్నింటికీ జీరో బిల్లులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గృహజ్యోతి పథకం కోసం ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేయలేదని...గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా  అర్హత ఉన్నవారందరికీ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే చాలామంది లబ్ధిదారులకు గృహజ్యోతి పథకం అమలు అవుతోంది. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్న వారికి విద్యుత్‌శాఖ సిబ్బంది జీరో బిల్లులు అందజేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లో చాలామందికి నెలకు 200 యూనిట్లలోపే విద్యుత్ వినియోగిస్తుంటారు. అలాంటి వారందరికీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం ఎంతో లబ్ధి చేకూరుస్తుంది. అయితే అన్ని అర్హతలు ఉండి కూడా విద్యుత్‌శాఖ సిబ్బంది కారణంగా కొందరు ఈ పథకాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. తమ తప్పు లేకున్నా..వారు నెలనెల బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. సిబ్బందిని అడిగితే తమకు తెలియదని...నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఎవరిని అడగాలో..ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తెలియక చాలామంది వదిలేశారు. ఇప్పుడు ప్రభుత్వ ప్రకటనతో వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు అయ్యింది.


Also Read: ఉమ్మడి విశాఖ జిల్లాలాలోని అందమైన జలపాతాలు ఇవే.. సందర్శనకు వెళ్లిపోండి


Also Read: హైదరాబాద్‌కు దగ్గర్లోనే అందమైన వాటర్ ఫాల్స్, పొద్దున్నే వెళ్తే సాయంత్రానికి వచ్చేయొచ్చు!


Also Read: తిరుపతికి అతి సమీపంలోనే ప్రఖ్యాత జలపాతాలు, దేవుడి దర్శనానికి వెళ్లినప్పుడు వీటిపైనా ఓ లుక్కేయండి