New Medical Colleges: రాష్ట్రంలో కొత్తగా 8 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణలో 26 వైద్య కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభిస్తుండగా.. తాజాగా మరో 8 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 34కు చేరబోతోంది. తాజా ఆదేశాలతో రాష్ట్రంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 10 వేలకు చేరింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి రాష్ట్రంలో కేవలం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 9 ఏళ్లలో జిల్లాకో వైద్య కళాశాల దిశగా సర్కారు అడుగులు వేసింది. జోగులాంబ గద్వాల్, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆయా వైద్య కళాశాలలకు ఎన్ఎంసీ నుంచి అనుమతులు జారీ అయితే వచ్చే విద్యా సంవత్సరానికి జిల్లాకో మెడికల్ కాలేజీ కల సాకారం అవుతుందని ప్రభుత్వం తెలిపింది. 


Also Read: Scholarships 2023: 9వ తరగతి నుంచి పీజీ వరకు స్కాలర్‌షిప్‌లు, నెలకు ఎంతవస్తుందో తెలుసా?






అయితే ఇప్పుడు సర్కారు అనుమతించిన 8 కాలేజీల్లో ఒక్కో దానిలో 100 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున మొత్తం 800 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పది వేలకు చేరువ కానుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి గాంధీ, ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజీ, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్ మెడికల్ కాలేజీలు మాత్రమే అందుబాటులో ఉండేవి. 2016వ సంవత్సరంలో మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాల్లో కళాశాలలు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. 2018-19 సంవత్సరంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాలోనూ ప్రభుత్వ వైద్య కళాశాలలను అందుబాటులోకి తెచ్చింది.


రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాకో మెడికల్ కాలేజీ కల సాకారం కానున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్య తెలంగాణ విజన్‌కు అనుగుణంగా ఈ కళాశాలలు విద్యార్థులకు వైద్య విద్యను అభ్యసించడానికి మరిన్ని అవకాశాలను పెంపొందిస్తాయని ట్వీట్ లో పేర్కొన్నారు.






ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు 100 సీట్లతో మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని విద్యా శాఖ మంత్రి సబితా రెడ్డి కొనియాడారు. మహేశ్వరం నియోజకవర్గంలో మెడికల్ కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.






Join Us on Telegram: https://t.me/abpdesamofficial