వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల కలిసి పూజలు నిర్వహించారు. హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో వారిద్దరూ పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను పవన్ కళ్యాణ్, అనా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. కొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకుపవన్ కళ్యాణ్ త్వరలో మంగళగిరి చేరుకుంటారని జనసేన అధికారిక ఖాతాలో ట్వీట్ చేశారు.
అయితే, పవన్ కల్యాణ్ తాజాగా ఆయన భార్యతో ఉన్న ఫోటోను ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మెగా కుటుంబంలో నిహారిక, జొన్నలగడ్డ చైతన్య విడాకులకు దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల కూడా విడాకులు తీసుకోబోతున్నారంటూ పుకార్లు వచ్చాయి. కొన్ని మీడియా సంస్థలు వీరి విడాకులు తీసుకోబోతున్నారా? అని అనుమానం వ్యక్తం చేస్తూ వార్తలు ప్రచురించాయి. అందుకు గల కారణాలను కూడా పేర్కొ్న్నాయి. ఇటీవల పవన్ కల్యాణ్ తో ఆయన భార్య కనిపించలేదని, వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ సమయంలో కూడా పవన్ కల్యాణ్ ఒక్కరే రావడంతో వీరు విడిపోయినట్లుగా కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాశాయి. తాజాగా ఒక్క ఫోటోతో పవన్ కల్యాణ్ ఈ పుకార్లకు చెక్ పెట్టినట్లు అయింది.