Hyderabad News: హయత్ నగర్ లో కిడ్నాప్ కు గురైన బాలికపై ఎలాంటి అత్యాచారం జరగలేదని డీసీపీ సాయి శ్రీ తెలిపారు. అయితే మంగళ వారం రోజు హయత్ నగర్ లో మైనర్ బాలిక కిడ్నాప్ కేసు అయినట్లు తమకు 100 డయల్ ద్వారా సమాచారం వచ్చిందని ఏసీపీ తెలిపారు. ఫోన్ వచ్చిన వెంటనే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పారు. రాత్రి 10 గంటల సమయం లో మైనర్ అమ్మాయి బాత్రూం కి వెళ్తుండగా.. ఒక వ్యక్తి బైక్ పై వచ్చి అడ్రస్ అడిగినట్లు అడిగి బలవంతంగా ఆమెను తీసుకుని వెళ్లాడని వివరించారు. అయితే కొంత దూరం వెళ్లగానే మరో వ్యక్తి వచ్చి బైక్ పై ఎక్కాడని వివరించారు. వారిద్దరూ కలిసి బాలికను అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలోని నిర్మానుష ప్రదేశంలో తీసుకెళ్లి అత్యాచారం చేయబోయారని పేర్కొన్నారు. కానీ బాలిక ప్రతిఘటించిన పారిపోయి అక్కడే సమీపంలో ఉన్న హోటల్ వద్దకు వెళ్ళిందని స్పష్టం చేశారు. బాలికపై ఎలాంటి అత్యాచారం జరగలేదని డీసీపీ వెల్లడించారు. 


అయితే నిందితుల వద్ద నుంచి నుండి పారిపోయి వచ్చే క్రమంలోనే మైనర్ బాలికకు.. చెట్ల పొదలు తాకి కాళ్లకు గాయాలు అయ్యాయని వివరించారు. అనంతరం నిస్సహాయ స్థితిలో ఉన్న బాలికను గమనించిన ఓ హిజ్రా వెంటనే ఆమె వద్దకు ఏం జరిగిందని ప్రశ్నించినట్లు చెప్పారు. బాలిక జరిగింది చెప్పిన వెంటనే.. ఆమె కుటుంబ సభ్యులు ఫోన్ నెంబర్ అడిగి వాళ్లకు ఫోన్ చేసినట్లు తెలిపారు. ఇలా బాలిక తల్లిదండ్రులు వచ్చే వరకు ఆ హిజ్రా పాపకు రక్షణ కవచంగా నిలబడి.. క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు డీసీపీ సాయి శ్రీ పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు వెల్లడించారు. మైనర్ బాలిక ప్రస్తుతం హయత్ నగర్ లోని మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని.. నిందితులు దొరికిన అనంతరం ఏం జరిగింది అన్న వాస్తవాలను మీడియాకు తెలియజేస్తామన్నారు. బాలిక కొద్ది రోజుల క్రితమే అంబర్ పేటలో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చిందని.. బాలిక తల్లిదండ్రులు ఓ ఇంట్లో వాచ్ మెన్ గా పని చేస్తున్నారని తెలిపారు.  త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. 


ఒక్కరోజు ముందే ఇలాంటి ఘటన - బైక్ పైనే అత్యాచారం


హైదరాబాద్ లోని తార్నాకలో నివాసం ఉంటున్న ఆర్తి అనే యువతి పాల డబ్బా తేవడం కోసం బయటికి వెళ్లింది. దగ్గర్లోని షాపు మూసేసి ఉండడం వల్ల ఆమె దూరం వెళ్లాల్సి వచ్చింది. ఆటో కోసం రోడ్డు మీద ఎదురుచూస్తూ ఉండగా, ఇంతలో ఓ యువకుడు బైక్‌పై అటుగా వచ్చాడు. దగ్గర్లోని మెడికల్ షాప్ గురించి అతణ్ని ఆరా తీయగా, కొంచెం ముందుకెళ్తే ఉందని చెప్పాడు. కావాలంటే అక్కడిదాకా లిఫ్ట్ ఇస్తానని చెప్పి బైక్‌ ఎక్కించుకున్నాడు. అతడ్ని నమ్మి యువతి బైక్ ఎక్కింది.


కొంచెం దూరం వెళ్లాక స్థానిక సల్మాన్ అనే హోటల్ దగ్గర యువతిపై చేతులు వేస్తూ లైంగిక దాడికి ప్రయత్నించాడు. తన రూంకి రావాలని అసభ్యంగా మాట్లాడాడు. ఆమె భయపడిపోయి తప్పించుకునే ప్రయత్నం చేయగా, బైక్‌ పైనుంచి రోడ్డుపైకి దూకేసింది. సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన టిప్పర్ లారీ ఆమె మీదుగా నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో ఆర్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. అరుపులు వేయడంతో విషయం గమనించిన స్థానికులు వెంటనే ఆర్తిని గాంధీ ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు.