హైదరాబాద్ లో దుండగులు రెచ్చిపోయారు. ఏకంగా ప్రభుత్వ అధికారులనే కిడ్నాప్ చేసిన విషయం వెలుగు చూసింది. నగరంలోని సరూర్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు సీజీఎస్టీ అధికారులతో పాటు ఓ షాపు ఓనర్, మరో ముగ్గురు వ్యక్తులను కిడ్నాప్‌ చేశారు. జీఎస్టీ అధికారులు ఓ షాపుపై చర్యలు తీసుకునేందుకు వెళ్లగా వారిని కిడ్నాప్ చేశారు.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కృష్ణా నగర్‌లో జీఎస్టీ కట్టడం లేదని ఓ షాపుపై జీఎస్టీ అధికారులు దాడులు చేశారు. ఆ షాపును సీజ్‌ చేయడానికి రెడీ అయ్యారు. జీఎస్టీ అధికారులు మణిశర్మ, ఆనంద్‌ ఆ ప్రాంతానికి వెళ్లగా.. అదే సమయంలో షాపు యజమానితో పాటు ఫార్చ్యునర్‌ కారులో ఇంకో ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. వారిని కిడ్నాప్‌ చేసి దాడి చేసినట్లుగా ఎల్బీ నగర్‌ డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు. నిందితులు నలుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. జీఎస్టీ అధికారులను రక్షించినట్లుగా వెల్లడించారు.


డీసీపీ సాయిశ్రీ ఘటనకు సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో వివరించారు. కేంద్ర జీఎస్టీ అధికారులను కిడ్నాప్ చేశారని తమకు నేడు (జూలై 5) ఉదయం 10:30 గంటలకు సమాచారం అందిందని అన్నారు. నకిలీ జీఎస్టీ కేసులకు సంబంధించిన తనిఖీల్లో భాగంగా అధికారులు మణిశర్మ, ఆనంద్ డ్యూటీపై వెళ్లారని అన్నారు. నేడు కృష్ణా నగర్‌లో స్క్రాప్, వెల్డింగ్ షాప్‌ కి చెకింగ్ కి వెళ్లారని చెప్పారు. ఆ సమయంలో స్క్రాప్ గోడౌన్ నిర్వహకులు జీఎస్టీ అధికారుల ఐడీ కార్డులు లాక్కున్నారని, ఆ తర్వాత వారిని వాహనంలో ఎక్కించుకొని వెళ్లారని అన్నారు. 


‘‘ఇద్దరు అధికారులపై దాడి చేయడంతోపాటు రూ.5 లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశారు. మణిశర్మ వెంటనే రూ.5 లక్షల గురించి ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే మేం అప్రమత్తం అయి వాహనాలను చెకింగ్ చేశాం. ఘటనా స్థలానికి 4 కిలో మీటర్ల లోపలే కిడ్నాపర్ల వాహనం ఉన్నట్లు గుర్తించాం. రాజీవ్ చౌక్ దగ్గర నిందితులు దొరికారు. వారిని అదుపులోకి తీసుకొని సీజీఎస్టీ ఇన్‌స్టెక్లర్లు మణిశర్మ, ఆనంద్‌లను రక్షించాం. ఖయ్యూం అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితులకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుంటున్నాం’’ అని డీసీపీ సాయిశ్రీ వివరాలు చెప్పారు.


కేంద్రం సీరియస్


జీఎస్టీ అధికారుల కిడ్నాప్‌ ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ నిర్మలా సీతారామన్‌ అధికారుల కిడ్నాప్‌ ఘటనపై ఆరా తీశారు. అధికారుల కిడ్నాప్‌ ఉదంతాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌, పోలీస్‌ కమిషనర్‌లను ఫోన్‌లో కోరారు.