దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్టు అయ్యారు. ఆయన సిద్దిపేట జిల్లాకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా హకీంపేట వద్ద ఎమ్మెల్యే కారును పోలీసులు అడ్డుకొని అదుపులోనికి తీసుకున్నారు. అక్కడి నుంచి సమీపంలోని అల్వాల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. రెండు రోజుల క్రితం గజ్వేల్‌ పట్టణంలో జరిగిన ఓ ఘటన నేపథ్యంలో.. బాధితుల తరఫున వాదించడానికి కోర్టుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు తనను అక్రమంగా అరెస్టు చేశారని రఘునందన్ రావు ఆరోపించారు. బాధితుల పక్షాన పోరాడి వారికి న్యాయం చేసేవిధంగా కృషి చేస్తానని రఘునందన్ తెలిపారు. ఈ ఘటన అనంతరం రఘునందన్ రావుకు ఈటల రాజేందర్ ఫోన్ చేసి మాట్లాడారు.


గజ్వేల్ లోని ఛత్రపతి శివాజీ విగ్రహం ఎదురుగా ఓ వ్యక్తి ఫూటుగా మద్యం సేవించి మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మూత్ర విసర్జన చేసిన వ్యక్తి ముస్లిం  మతానికి చెందిన వ్యక్తి కావడం పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ ఘటన గమనించి కొంత మంది, శివాజీ విగ్రహం కమిటీ అయిన భగత్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఆ వ్యక్తిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌ కు తరలించారు. ఆ తర్వాత సీఐకి ఫిర్యాదు కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. 


ఘటనకు నిరసనగా కొంత మంది పోలీస్ స్టేషన్ నుంచి పట్టణంలోని శివాజీ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. ర్యాలీ నిర్వహించి తిరిగి వస్తున్న క్రమంలో అందులో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి ప్రయత్నించారు. వారిలో మధు అనే వ్యక్తి పోలీస్ స్టేషన్‌ వైపు వెళ్లగా, సందీప్‌ అనే యువకుడి తలపై కూల్ డ్రింగ్ సీసాతో దాడి చేశారు. ఈ ఘటనలో సందీప్‌ తలకు తీవ్రమైన గాయం అయింది. ఇలా వరుస ఘటనల వేళ హిందువులు అందరూ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్దకు చేరుకుని ధర్నా, రాస్తారోకో చేశారు.