తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను దించేసిన అధినాయకత్వం కిషన్‌ రెడ్డికి పగ్గాలు అప్పగించారు. దీనిపై ఆయన ఇంత వరకు స్పందించలేదు. ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న ఆయన కేబినెట్‌ మీటింగ్‌కి కూడా హాజరుకాలేదు. ఆయన రాజీనామా చేశారని కొందరు, చేయబోతున్నారని మరికొందరు చెబుతున్నారు. 


తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు అందర్నీ షాక్‌కి గురి చేసింది. బండి సంజయ్‌ను తప్పిస్తారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ పుకార్లు అంటూ కేంద్ర అగ్రనాయకుల నుంచి రాష్ట్ర నాయకుల వరకు అంతా ఖండించారు. బండి సంజయ్‌ ఆధ్వర్యంలోనే ఎన్నికలను పేస్ చేయబోతున్నట్టు పదే పదే చెబుతూ వచ్చారు. 


మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయన్న టైంలో బీజేపీ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. బండి సంజయ్‌ను తప్పింది కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించింది. దీనిపై బీజేపీ నాయకులే బహిరంగ విమర్శలు చేస్తున్నారు. బండి సంజయ్ సహా కొందరు సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 


బీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొని పార్టీని పరుగులు పెట్టించిన వ్యక్తిని కాకుండా కిషన్ రెడ్డిని నియమించడం సరికాదని చాలా మంది బీజేపీ లీడర్లు అభిప్రాయపడుతున్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ప్రత్యర్థుల విమర్శలకు బలమిచ్చారని అంటున్నారు. ఆయనతో బీజేపీ అధికారంలోకి రావడం సాధ్యం కాదని చాలమంది అభిప్రాయపడుతున్నారు. 


కిషన్ రెడ్డి వ్యతిరేక వర్గం అభిప్రాయం అలా ఉంటే... ఆయన సన్నిహితులు మరో వాదన వినిపిస్తున్నారు. కేంద్రమంత్రి పదవి వదులుకొని మళ్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం కిషన్ రెడ్డికి కూడా ఇష్టం లేదని అంటున్నారు. ఆయన దృష్టి జాతీయ రాజకీయాలపై ఉందని.. జాతీయ అధ్యక్షుడు అవ్వాలని కోరిక ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే పార్టీ తనకు రాష్ట్ర పగ్గాలు అప్పగించినప్పటికీ ఆయన స్పందించలేదు. 


ఇప్పటి వరకు అధినాయకత్వం నిర్ణయంపై స్పందించని కిషన్ రెడ్డి బుధవారం జరిగిన కేంద్రమంత్రివర్గం భేటీకి కూడా వెళ్లలేదు. ఢిల్లీలోనే ఉన్నప్పటికీ ఆయన మీడియా ముందుకు రావడం లేదు. ఈ నిర్ణయాలు ప్రకటించకముందే మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడరు. మార్పు చేర్పులపై కూడా ఏం సమాధానం చెప్పలేదు. 


అధ్యక్ష పదవిని తీసేశారని బండి సంజయ్‌, అధ్యక్ష పదవి తనకు వద్దని కిషన్ రెడ్డి ఇద్దరూ అసంతృప్తిగానే ఉన్నారు. వీళ్లిద్దరి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మిగతా నాయకులు కూడా సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ మొత్తం సైలెంట్‌ మోడ్‌లో ఉంది. ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నారు.



ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఈ ఉదయం కేంద్రకేబినెట్‌ సమావేశమైంది. ఈ భేటీకి కిషన్ రెడ్డి గైర్హాజరయ్యారు. దీంతో ఆయన రాజీనామా చేశారని కొందరు రాజీనామా చేయబోతున్నారని మరికొందరు చెబుతున్నారు. ఆయన మాత్రం దీనిపై స్పందించడం లేదు. కిషన్ రెడ్డి మోదీ ప్రభుత్వంలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నారు. 


2020లో రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ నియమితులయ్యారు. ఆయన కరీంనగర్ ఎంపీగా ఉన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్సెస్‌ఫుల్‌గా చేపట్టారు బండి సంజయ్‌. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేశారు. తన పదవీకాలంలో పాదయాత్ర, వివిధ నిరసనలు, ఆందోళనల్లో పాల్గొని తనదైన ముద్ర వేశారు. కొందరు నాయకులను కలుపుకొని వెళ్లడంతో విఫలమయ్యారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఎన్నికల ముందు ఆయన్ని తప్పించారని టాక్. మొత్తానికి అధిష్ఠానం తీసుకున్న ఈ నిర్ణయం ఏ వైపునకు దారి తీస్తుందో అన్న టెన్షన్‌ మాత్రం పార్టీలోని ద్వితీయశ్రేణి నాయకుల్లో కనిపిస్తోంది.