Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ప్రయాణికుల ఆదరణ వల్ల సోమవారం ఒక్కరోజే 5.10 లక్షల మంది మెట్రోలో ప్రయాణించారు. భాగ్య నగరంలో మెట్రో రైలు ప్రారంభం అయినప్పటి నుంచి ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణం చేయడం ఇదే మొదటి సారి. అయితే ఇందులో సగానికి పైగా అంటే రెండున్నర లక్షల మంది ప్రయాణికులు మియాపూర్ నుంచి ఎల్బీనగర్ కారిడార్ లోనే ప్రయాణించారు. నాగోల్ నుంచి రాయదుర్గం మార్గంలోనూ 2.25 లక్షల మంది రాకపోకలు సాగించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఈ రెండు కారిడార్లు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. పాతిక వేల తేడాతో రెండు కారిడార్లలోనూ రెండు లక్షలకు పైగా ప్రయాణికులు ప్రయాణం చేశారు. 


భాగ్యనగర వాసులకు అత్యంత కీలక ప్రజా రవాణా సాధనాల్లో మెట్రో రైలు ఒకటి. ఈ ఆధునిక రవాణా వ్యవస్థను మొదటి నుంచి అన్ని వర్గాలు ఆదరిస్తున్నాయి. ప్రస్తుతం మూడు కారిడార్లలో కలిపి 69.2 కిలో మీటర్ల మేర మెట్రో రైలు పురగులు తీస్తోంది. 2017 నవంబర్ 29వ తేదీన హైదరాబాద్ లో మెట్రోరైలు సేవలు ప్రారంభం అయ్యాయి. తొలిరోజు నుంచి ప్రయాణికులు మెట్రో ప్రయాణంపై చాలా సంతృప్తిగా ఉన్నారు. మెట్రో ప్రారంభించిన రెండున్నర ఏళ్లలోనే ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. 2020 ఫిబ్రవరి నాటికి ప్రయాణికుల సంఖ్య 4 లక్షలకు చేరింది. లాక్ డౌన్ విధించే సయానికి ఒకరోజు గరిష్టం 4.75 లక్షలుగా నమోదు అయింది. ఆ తర్వాత లాక్ డౌన్ సమయంలో దాదాపు ఆరు నెలల పాటు మెట్రో రైల్లు డిపోలకే పరిమితం అయ్యాయి. అయితే 2020 సెప్టెంబర్ నెలలో తిరిగి మెట్రో సేవలు ప్రారంభం అయినప్పటికీ.. కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ భయంతో చాలా మంది మెట్రో ఎక్కేందుకు వెనుకాడారు. 


కరోనా తర్వాత పుంజుకున్న మెట్రో..


కానీ కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత నుంచి మెట్రోకు ప్రయాణికుల సంఖ్య పెరిగిపోయింది. 2021 జనవరి నాటికి ప్రయాణికుల సంఖ్య 1.60 లక్షలు ఉండగా.. మార్చి 2022 నాటికి ఆ సంఖ్య 3 లక్షలకు చేరుకుంది. అలాగే అదే ఏడాదిలో నాలుగు లక్షల మైలురాయిని కూడా అందుకుంది. అయితే మెట్రోలో ప్రయాణిస్తున్న వాళ్లలో ఐటీ, ఐటీ ఆధారిత సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు మొదటి వరుసలో ఉన్నారు. వీరు రోజు సగటున 1.40 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరి తర్వాతి స్థానం విద్యార్థులదే. నిత్యం 1.20 లక్షల మంది విద్యార్థులు మెట్రో ద్వారానే ప్రయాణం సాగిస్తున్నారు. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 40 కోట్ల మంది ప్రజలను.. మెట్రో గమ్యస్థానాలకు చేర్చింది. అయితే ఎక్కువ మంది రాకపోకలు సాగించిన స్టేషన్లలో రాయదుర్గం(32,000), ఎల్బీనగర్(30,000), అమీర్ పేట(29,000), మియాపూర్(23,000) ఉన్నాయి. 






ట్విట్టర్ ద్వారా ప్రయాణికులకు మెట్రో సంస్థ ధన్యవాదాలు


5 లక్షల మైలురాయిని చేరేందుకు ఆదరించిన ప్రయాణికులకు మెట్రో సంస్థ ధన్యవాదాలు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ నుంచి నిరంతరం సహకారం, మద్దుతుతోనే ఇదంతా సాధ్యమైందని పేర్కొంది.