2023లో ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ అధినాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రాల అధ్యక్షులను మార్చడంతోపాటు వివిధ కీలకమై పదవుల్లో సీనియర్లను నియమించింది. ఈ క్రమంలోనే కొన్ని స్పష్టమైన సంకేతాలు పంపించింది.
బీజేపీ అంటే ఆర్‌ఎస్‌ఎస్ డామినేషన్. డైరెక్ట్‌గా ఇండైరెక్ట్‌గా వారి సూచనలు పార్టీ నేతలు తప్పక పాటిస్తారనే టాక్ ఉంది. బీజేపీకి ఆర్‌ఎస్‌ఎస్ బ్యాక్‌బోన్‌లా ఉంటుందని కూడా అంటారు. అందుకే వేరే పార్టీల నుంచి వెళ్లిన వారికి సరైన ప్రాధాన్యత ఇస్తామని చెప్పినా అది జరగదనే విమర్శ ఉండేది. చిన్న చిన్న పదవుల్లో తప్ప కీలకమైన పదవుల్లో వారిని నియమించడం అంత ఈజీ కాదని కూడా అంటుంటారు.
ఇది ఒకప్పటి మాటని... బీజేపీలో ఆ విషయంలో మార్పు వచ్చిందని చెబుతున్నారు. అమిత్‌షా, మోదీ హయాంలో అలాంటి విమర్శలకు ఆస్కారం లేదని పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. ఏ పార్టీ నుంచి వచ్చినా... రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పకనే చెబుతూ వచ్చారు. ఇప్పుడు మరోసారి రుజువు చేశారు.
ఆర్‌ఎస్‌ఎస్ చెప్పిన సలహాలను రాజకీయంగా కలిసి వస్తాయే పాటిస్తామన లేకుంటే వాటిని పట్టించుకోబోమని కూడా తేల్చేస్తోంది మోదీషా ద్వయం. అందుకే బండి సంజయ్‌ను మార్చొద్దని ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఒత్తిడి వచ్చినా పట్టించుకోలేదు. ఆయన్ని తప్పించి కిషన్ రెడ్డికి తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించారు. అంతే కాదు తెలంగాణలో కీలకమైన నేతగా ఉన్న ఈటల రాజేందర్‌కు ముఖ్యమైన పదవి కట్టబెట్టారు. ఎన్నికల సంఘ నిర్వహణ అధ్యక్షుడిని చేశారు. మొదటి నుంచి పార్టీలో లేకపోయినా... ఈటలకు కీలకమైన బాధ్యతలు అప్పగించారు. మొదటి నుంచి కేసీఆర్, బీఆర్‌ఎస్‌తో నడిచిన ఈటల 2021లో నాటకీయ పరిణామాల మధ్య బయటకు వచ్చారు. 2021 జూన్‌లో బీజేపీలో చేరారు. ఒకానొక దశలో బీజేపీ అధ్యక్ష పదవి కూడా పోటీ పడ్డారు. కానీ అధినాయకత్వ ఎన్నికల నిర్వహణ బాధ్యత అప్పగించింది.
ఏపీ విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అయింది. కొత్త అధ్యక్షరాలిగా నియమితులైన దగ్గుబాటి పురందేశ్వరి అనూహ్యంగా బీజేపీలో 2014లో చేరారు. ఎన్టీఆర్ కుమార్తెగా రాజకీయ రంగప్రవేశం చేసిన ఆమె... తర్వాత తన టాలెంట్‌తో తనకంటూ జాతీయస్థాయిలో ఇమేజ్ బిల్డ్ చేసుకున్నారు. ఇప్పుడు బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకోనున్నారు. ఈమె రాజకీయ ప్రవేశం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలైంది. రాష్ట్రవిభజన తర్వాత కాషాయం కండువా కప్పుకున్నారు. ఈమెకు కూడా ఆర్‌ఎస్‌ఎస్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. అయినా అధ్యక్షురాలయ్యారు.
ఉమ్మడి రాష్ట్రానికి ఆఖరి సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ మధ్య కాలంలోనే బీజేపీలో చేరారు. ఈయన పొలిటికల్ కెరీర్ కూడా కాంగ్రెస్‌లోనే మొదలైంది. సమైక్యాంధ్రకు ఆఖరి సీఎంగా ఉంటూ విభజన అంశంలో అధినాయకత్వాన్ని ధిక్కరించిన నేతగా పేరుపొందారు. తర్వాత సమైక్యాంధ్ర పేరుతో ప్రత్యేక పార్టీ పెట్టి ఓడిపోయిన ఆయన మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. అయినా చాలా ఇన్‌యాక్టివ్‌గా ఉంటూ వచ్చారు. ఓ ఫైన్ మార్నింగ్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేసి కాషాయం గూటికి చేరారు. అప్పటి నుంచి పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యారు. ఆయనకు జాతీయ కార్యవర్గంలో పదవి ఇచ్చింది బీజేపీ.
బాబూలాల్ మారండి.. ఈయన జార్ఖండ్ తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పట్లో బీజేపీలో ఉండేవాళ్లు. తర్వాత జార్ఖండ్ వికాస్ మోర్చా పేరుతో ఓ పార్టీ పెట్టి విజయం సాధించడంలో విఫలమయ్యారు. దీన్ని 2020లో బీజేపీలో కలిపేశారు. ఇప్పుడు ఆయన్ని అధ్యక్షుడిని చేస్తూ బీజేపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయన జార్ఖండ్‌లో ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు.
పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా అయిన సునీల్‌కుమార్ జఖర్ కూడా కాంగ్రెస్ వ్యక్తే. గతేడాదే ఆయన బీజేపీలో చేరారు. గతంలో ఈయన పంజాబ్ పీసీసీ చీఫ్‌గా కూడా పని చేశారు. ఈయన కూడా 2020లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఇలా వివిధ పార్టీల నుంచి వచ్చిన వారిని, బీజేపీని వీడి మరోసారి బీజేపీలోకి వచ్చిన వారికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: బండిని జరిపింది ఎవరు! ఈటల, రఘునందన్ లు హ్యాపీయేనా!
Also Read: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ హైకమాండ్ వ్యూహంపై అస్పష్టత - అసలేం చేయాలనుకుంటున్నారు ?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial