BJP Vishnu Slams YSRCP : వక్ఫ్ బోర్డు చట్టం విషయంలో వైఎస్ఆర్‌సీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.  నాడు అధికారంలో ఉండి ఆంధ్రప్రదేశ్‌ అంతటా వక్ఫ్ భూములు లూటీ అయినప్పుడు కళ్లుమూసుకున్న   వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ముస్లింల రక్షకుల్లా నటిస్తోందని విమర్శించారు.  వైఎస్ఆర్‌సీపీ   వక్ఫ్ చట్టాన్ని రక్షించడానికి కాదు – వారి పాలనలో వక్ఫ్ ఆస్తులు కబ్జా చేసిన నేరస్తులను కాపాడడానికే నేడు సుప్రీంకోర్టు లో సవాల్ చేస్తున్నారని ఆరోపించారు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మైనారిటీలంటే నిజమైన ప్రేమ కాదు , వారిని ఓటు బ్యాంక్ గానే చూస్తున్నారన్నారు. ఇప్పుడేమో కోర్టులను కూడా వాడుకుని తమ పాపాల్ని కడిగేసుకునే  ప్రయత్నం చేస్తున్నారని.. ఇది అసహ్యకరమైన రాజకీయ నాటకమని విష్ణు విమర్శించారు.  

సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన వైఎస్ఆర్‌సీపీ

వక్ఫ్ బిల్లును  చట్టంగా చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టులో వైఎస్ఆర్‌సీపీ పిటిషన్ వేసింది.  ముస్లిం సమాజం ఆందోళనలను పరిష్కరించడంలో వైఫల్యం, రాజ్యాంగ ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తూ వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని వైఎస్ఆర్‌సీపీ తెలిపింది.  ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 13, 14, 25 , 26 లను ఉల్లంఘిస్తుందని పిటిషన్‌లో పేర్కొంది.  . ప్రాథమిక హక్కులు, చట్టం ముందు సమానత్వం, మత స్వేచ్ఛ ,  మతపరమైన వర్గాలు తమ సొంత వ్యవహారాలను నిర్వహించడానికి స్వయంప్రతిపత్తిని రాజ్యాంగం హామీ ఇచ్చిందన్నారు.  సెక్షన్ 9 ,  14 కింద ముస్లిమేతర సభ్యులను చేర్చడం వక్ఫ్ సంస్థల అంతర్గత పనితీరులో జోక్యంగా పరిగణించాలని..  ఈ నిబంధన బోర్డుల మతపరమైన లక్షణాన్ని,  పరిపాలనా స్వచ్చను దెబ్బతీస్తుందని వైసీపీ తన పిటిషన్ లో పేర్కొంది. 

సుప్రీంకోర్టులో వక్ఫ్ బోర్డుపై పలు పిటిషన్లు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభలో..రాజ్యసభలో వక్ఫ్ బిల్లును వ్యతిరేకించింది.  కానీ రాజ్యసభ ఓటింగ్ సమయంలో కొంత మంది వైసీపీ సభ్యులు వక్ఫ్ బిల్లుకు మద్దతుగా ఓటేశారన్న ప్రచారం జరిగింది. అయితే తాము  విప్ జారీ చేశామని వైసీపీ తెలిపింది.  పలు పార్టీలు, వ్యక్తులు ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయగా వారితో పాటు వైసీపీ కూడా దాఖలు చేసింది.