Nara Lokesh: నారా లోకేష్‌పై ఓ టీడీపీ కార్యకర్త తీవ్ర ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. లోకేష్ అపాయింట్ మెంట్ కోసం 22 లక్షలు చెల్లించానన్నారు. అయితే ఇప్పుడు తనను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆ వ్యక్తి టాలీవుడ్ పేరుతో సోషల్ మీడియా అకౌంట్ నడుపుతున్నాడు. ఎన్నారైగా భావిస్తున్నారు. నారా లోకేష్ అట్లాంటా పర్యటనకు వచ్చినప్పుడు ఓ ఫైల్ ఇచ్చానని ఆ ఫైల్ గురించి ఇప్పుడు అసలు స్పందించడం లేదన్నారు.
తాను టీడీపీ అభిమానని.. పాతికేళ్లుగా టీడీపీ కోసం పని చేస్తున్నాని ఆయన ఫోటోలు పెట్టాడు.
అయితే అసలు వివాదం ఏమిటో చెప్పలేదు. కానీ.. సాయికార్తీక్ సిటీ సెంటర్ అనే ఆస్తి విషయంలో ఇదంతా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యక్తి చిలుకలూరిపేట నియోజకవర్గానికి చెందిన వారు. అక్కడ కొంత కాలం కిందట సాయి కార్తీక్ సిటీ సెంటర్ అనే షాపింగ్ మాల్ ను కొంత మంది భాగస్వాములు కలిసి నిర్మించారు. వీరు ఎన్నారైలు. వీరిలో ఈ పోస్టు పెట్టిన వ్యక్తి ఓ భాగస్వామిగా భావిస్తున్నారు. ఈ వ్యాపారంలో వచ్చిన వివాదాల వల్ల.. అతన్ని ఆ ఆస్తి నుంచి తప్పించినట్లుగా తెలుస్తోంది. అయితే తనను మోసం చేశారని..కబ్జా చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. న్యాయం చేయమని అడిగినా లోకేష్ స్పందించడం లేదని ఆయన వాదనగా తెలుస్తోంది.
యరగోళ్ల రాంబాబుఅనే వ్యక్తికి డబ్బులు ఇచ్చానని అతను లోకేష్ బినామీ అని ఈ వ్యక్తి ఆరోపిస్తున్నాడు.
ఈ ఆరోపణలపై టీడీపీ వర్గాలు ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.