Vikram's Veera Dheera Sooran OTT Release On Amazon Prime Video: కోలీవుడ్ స్టార్ విక్రమ్ (Chiyaan Vikram) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'వీర ధీర శూరన్ పార్ట్ 2' (Veera Dheera Sooran Part 2). అరుణ్ కుమార్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. తాజాగా.. ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
థియేటర్లలో విడుదలైన నెల రోజులైనా కాక ముందే ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 24 నుంచి ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో (Amazon Prime Video) ఈ మూవీ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. 'ఒక రాత్రి. నియమాలు లేవు. మనుగడ మాత్రమే. ప్రతిదీ మార్చే రాత్రి.' అని పేర్కొంది. దీంతో చియాన్ ఫ్యాన్స్‌తో సినీ ప్రియులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఈ సినిమాను హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు నిర్మించగా.. విక్రమ్ సరసన దుషారా విజయన్ హీరోయిన్‌గా నటించారు. తమిళ స్టార్ ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడి, పృథ్వీరాజ్, సిద్ధిఖీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. 'తంగలాన్' తర్వాత విక్రమ్ హీరోగా వచ్చిన ఈ మూవీ తమిళంలో మంచి టాక్ తెచ్చుకోగా.. తెలుగులో అంతగా రాణించలేకపోయింది. అదే సమయానికి 'మ్యాడ్ స్క్వేర్', రాబిన్ హుడ్ రిలీజెస్ట్ ఉండడంతో అంతగా ఎవరూ పట్టించుకోలేదు.
స్టోరీ ఏంటంటే?
గ్రామంలో ఓ కిరాణా కొట్టు నడుపుకొంటున్న కాళి (విక్రమ్), తన భార్య వాణి (దుషారా విజయన్), పిల్లలతో ప్రశాంతంగా జీవనం సాగిస్తుంటాడు. అంతకు ముందు ఊళ్లో రవి (30 ఇయర్స్ పృథ్వీ) అనే పెద్ద మనిషి దగ్గర నమ్మకమైన అనుచరుడిగా ఉంటాడు. చాలా గొడవలో తలదూర్చి రవికి అండగా ఉంటూ చెప్పిన పనులు చేసేవాడు. అయితే, అన్నీ మర్చిపోయి ప్రశాంతమైన జీవితం గడుపుతున్న సమయంలోనే రవి.. కాళి దగ్గరకు వచ్చి.. తనను, తన కొడుకును కాపాడాలని వేడుకుంటాడు.
ఎస్పీ అరుణగిరి (ఎస్‌జె సూర్య) తనను, తన కొడుకును ఎన్‌కౌంటర్ చేయాలనుకుంటున్నట్లు కాళికి చెప్తాడు రవి. ఎస్పీని చంపాలని సాయం కోరతాడు. అందుకో కాళి ఒప్పుకొన్నాడా?, ఎస్పీకి, రవికి మధ్య వైరం ఏంటి?, పాత గొడవలకు, వీరిని ఎన్‌కౌంటర్ చేయాలనుకోవడానికి, కాళికి ఏమైనా సంబంధం ఉందా?, తన కుటుంబం జోలికి వచ్చిన వారిని కాళి ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.