BJP Plan :  సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావడానికి  బీజేపీ పార్టీని పునర్ వ్యవస్థీకరిస్తోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల్ని మార్చేశారు. తెలంగాణలో ఊహించని విధంగా అధికార పార్టీకి కొరకరాని కొయ్యగా ఉన్న  బండి సంజయ్ ను తప్పించి తెలంగాణ పార్టీ బాధ్యతలు కేంద్ర మంతి కిషన్ రెడ్డికి అప్పగించారు.   దీంతో పాటు ఏపీలో సోము వీర్రాజు  పై వేటు వేసి పురంధేశ్వరికి  పగ్గాలు అప్పగించారు. అయితే వీరి నియామకాల్లో  బీజేపీ హైకమాండ్ ఏ సమీకరణాలు చూసిందన్నది ఎవరికీ అర్థం కాని విషయం. దీంతో బీజేపీలోనే అయోమయం ఏర్పడుతోంది. 


బండి సంజయ్ తీసేసి మరీ కిషన్ రెడ్డికి ఎందుకు పగ్గాలు ?


కిషన్ రెడ్డి రెండు సార్లు ఇప్పటి తెలంగాణ  బీజేపీ అధ్యక్షునిగా చేశారు. పార్టీపై ఆయన నిబద్దతను ఎవరూ ప్రశ్నించలేరు. కానీ ఇప్పుడు కిషన్ రెడ్డికి బాధ్యతలు అంటే మాత్రం బీజేపీ క్యాడర్ కూడా నిరాశ చెందుతున్నారు. సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తల నిరాశ స్పష్టంగా కనిపిస్తోంది. కిషన్ రెడ్డి లో  బండి సంజయ్ కు ఉన్నంత దూకుడు లేదు. ఆయనది  సాఫ్ట్ నేచర్. ముఖ్యంంగా బీఆర్ఎస్ నేతలు చేసే రాజకీయానికి తగ్గ దూకుడు చూపించరని.. బండి సంజయ్ అయితేనే కరెక్టని ఎక్కువ మంది నమ్ముతారు. అయితే అనూహ్యంగా ఆయనను తప్పించి ఎన్నికలకు ముందు కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించడానికి బీజేపీ హైకమాండ్ అసలు ఏం ఆశించిందో చాలా మందికి అర్థం కావడం లేదు. ఈటల రాజేందర్ కు ఎన్నికల కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారు. అదేదో బండి సంజయ్ నే అధ్యక్షునిగా కొనసాగించి ఈటలకు ఇచ్చి ఉంటే సమస్య పరిష్కారమయ్యేది కదా అనేది ఎక్కువ మంది అభిప్రాయం. 


దెబ్బతిన్న సామాజిక సమీకరణాలు!


రాజకీయాల్లో ఎలా లేదన్నా.. కుల సమీకరణాలు అత్యంత కీలకం. ప్రస్తుతం బీజేపీకి ఖచ్చితమైన ఓటు బ్యాంక్ అవసరం చాలా ఉంది. మున్నూరుకాపు వర్గం బీఆర్ఎస్ పై వ్యతిరేకంగా ఉంది. బీజేపీ వైపు మొగ్గుతున్నారని బండి సంజయ్ తో పాటు ధర్మపురి అర్వింద్ ఎంపీలుగా గెలిచినప్పుడు ఓ అభిప్రాయం వినిపించింది. బండి సంజయ్ ను తెలంగాణ బీజేపీ చీఫ్ గా పెట్టిన తర్వాత ఆ వర్గం బీజేపీ వైపు వచ్చిందని అనుకున్నారు. అయితే  హఠాత్తుగా ఆయనను తప్పించి మళ్లీ కిషన్ రెడ్డిని నియమించారు. ప్రస్తుతం రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్ వైపు ఉందని ఎవరైనా అంచనా వేస్తారు. ఆ వర్గం బీజేపీ వైపు ఇప్పుడున్న  పరిస్థితుల్లో రారు. అండగా ఉంటుందనుకున్న వర్గాన్ని దూరం చేసుకుని బీజేపీ కొత్తగా ఏం సాధిస్తుందో బీజేపీ కార్యకర్తలకూ అర్థం కావడం లేదు. ఇదే అవకాశంగా.. ఇతర పార్టీల నేతలు.. బీఆర్ఎస్‌తో ఫ్రెండ్లీ ఫైట్ కోసమే.. బీజేపీ అధ్యక్షుడ్ని మార్చారని.. బండి సంజయ్ పై వారికి చాలా కోపం ఉందని గతంలోనే బయటపడిందని అంటున్నారు. దీన్ని తిప్పికొట్టడానికి  బీజేపీ తంటాలు పడాల్సి రావొచ్చు. 


ఏపీలో పురందేశ్వరికి కలిసొచ్చిన సమీకరణాలేంటి ?


ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని అనూహ్యంగా ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరికి అప్పగించారు. సోము వీర్రాజును తప్పిస్తారని  కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది కాన... పురందేశ్వరికి ఇస్తారని ఎవరూ అనుకోలేదు. మొదటగా ఆమె  రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ లేరు. రెండోది ఆమె వల్ల బీజేపీకి కలసి వచ్చే సామాజికవర్గం ఏమీ ఉండదు. రాయలసీమకు చెందిన సత్యకుమార్ యాదవ్‌ పేరు ఎక్కువగా వినిపించింది.కానీ  టీడీపీ ముద్ర ఉండడంతో అధ్యక్ష స్థానాన్ని సత్య కుమార్ దక్కించుకోలేక పోయారనే చర్చ నడుస్తోంది.. బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రియ అనుచరుడిగా బీజేపీలో సత్యకుమార్‌కు గుర్తింపు ఉంది.. కానీ, అధ్యక్ష పదవి మాత్రం అందకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో అధ్యక్షుడ్ని మార్చటం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని హైకమాండ్ నిర్ణయంపై ఎలాంటి స్పష్టతా లేదు వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కుదుర్చుకునే ఆలోచన ఉంటే ఎన్టీఆర్ కుమార్తెకు అధ్యక్ష బాధ్యతలు ఎలా అప్పగిస్తారని కూడా చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో  సోము వీర్రాజును తప్పించడం ద్వారా వైసీపీ ముద్రను తుడిచేసుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు. 


టీడీపీ ఓటు బ్యాంక్ ను పొందగలరా ?
 
టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహారి శైలి నచ్చకే గతంలో తెలుగుదేశం పార్టీని వీడారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి దంపతులు. దాంతోనే ఆమెను ఎంచుకున్నారనే చర్చ కూడా సాగుతోంది.. అంతేకాదు..   పురంధేశ్వరికి బాధ్యతలు అప్పగించడంతో.. జూనియర్ ఎన్టీఆర్‌ను దువ్వేందుకు కూడా ఆమె ఉపయోగపడతారనే యోచనలో బీజేపీ హైకమాండ్‌ ఉంది. పార్టీకి సినీ గ్లామర్  జత చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్‌ అవసరమని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది.. గతంలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కూడా జరిగింది.. ఇప్పుడు మేనత్త పురంధేశ్వరి కి బాధ్యతలు ఇవ్వడం ద్వారా ఎన్టీఆర్‌ను బీజేపీకి దగ్గర చేసే ప్లాన్ లో భాగమేనని తెలుస్తోంది. అయితే ఇదంతా తేలిక కాదు. ఆ విషయం  బీజేపీ హైకమాండ్‌కు తెలియక కాదు.