Telangana News: ఈ మధ్యకాలంలో మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో స్థానికత అంశం పెను దుమారాన్నే రేపింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. దీనిపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీంతో కౌన్సిలింగ్ నిర్వహించుకోవడానికి మార్గం సుగమమమైంది. కోర్టుకు వెళ్లిన వాళ్లు కూడా కౌన్సెలింగ్ పాల్గొనవచ్చని కోర్టు పేర్కొంది.  


33వ నెంబర్ జీవోను వ్యతిరేకించిన విద్యార్థులు 


మారిన పరిస్థితులతో మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు చేర్పులు చేసింది. నీట్‌ పరీక్షకు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో నివాసం ఉన్న, చదివిన వాళ్లు మాత్రమే వైద్య విద్యలో ప్రవేశానికి అర్హులని తేల్చింది. ఈ మేరకు ప్రవేశాల జరగాలని జీవో 33ని రిలీజ్ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్థులు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 


హైకోర్టులో అనుకూలంగా తీర్పు


జులై 19 రిలీజ్ చేసిన 33వ జీవో సరికాదని హైకోర్టులో 135 మంది విద్యార్థులు కోర్టులో పిటిషన్ వేశారు. తమకు అన్యాయం జరుగుతుందని కోర్టులో వాదించారు. వారి వాదనతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. జీవోను నిలుపుదల చేస్తూ తీర్పు ఇచ్చింది. 


సుప్రీంలో గట్టిగా వాదనలు 


సెప్టెంబర్‌ ఐదున ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వీ తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. గత తీర్పును ఉటంకిస్తూ వాటి ఆధారంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వాదించారు. తెలంగాణ విద్యాలయాల్లో ప్రవేశాలు పొందాలంటే రాష్ట్రంలో నీట్ రాయడంతోపాటు 9వ తరగతి నుంచి నాలుగేళ్ల పాటు తెలంగాణలో చదివి ఉండాలని అన్నారు. దీన్ని దృవీకరించే తీర్పులు వివరించారు. అంతే కానీ తెలంగాణలో పరీక్ష రాసిన వారినే గుర్తిస్తే మిగతా వాళ్లకు అ్యాయం జరుగుతుందని అన్నారు. 


ఆఖరి నిమిషంలో చెప్పారు: విద్యార్థుల తరఫు న్యాయవాది


సీనియర్‌ న్యాయవాది మురళీధర్‌ స్టూడెంట్స్ తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. విభజన చట్టం గడువు ముగుస్తున్న టైంలో, నీట్ ఫలితాలు వచ్చే క్రమంలో జీవో విడుదల చేయడం దారుణం అన్నారు. కనీసం ఆరు నెలల ముందు చెప్పి ఉంటే విద్యార్థులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకునే వాళ్లని అన్నారు. ఇప్పుడు చాలా మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని వెల్లడించారు. 


కోర్టుకెళ్లిన విద్యార్థులకు ఓకే చెప్పిన ప్రభుత్వం


అయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలోనే ప్రభుత్వం తరఫున వాదించే సింఘ్వీ జోక్యం చేసుకొని పిటిషన్ వేసిన విద్యార్థులకు మినహాయింపు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. కౌన్సిలింగ్‌కు అనుమతి ఇవ్వాలని రిక్వస్ట్ చేశారు. 


ప్రతివాదులకు నోటీసులు


ప్రభుత్వం, విద్యార్థుల తరఫున న్యాయవాదులు వాదన విన్న తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు వెల్లడించింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. కోర్టుకు వచ్చిన విద్యార్థులకు కౌన్సిలింగ్‌కు అనుమతి ఇచ్చింది. అంతే కాకుండా ప్రతివాదులకు నోటీసులు కూడా జారీ చేసింది. రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ వాయిదా వేసింది. 


Also Read: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం