Superstar Krishna Funeral Live Updates: నేడు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు, సూపర్‌స్టార్‌కు సీఎం జగన్, బాలకృష్ణ నివాళులు

తెలుగు సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు నేడు అధికార లాంఛనాలతో హైదరాబాదులోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.

ABP Desam Last Updated: 16 Nov 2022 12:27 PM
Padmalaya Stidios: పద్మాలయ స్టూడియోస్‌కు పోటెత్తిన జనం

కృష్ణ పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు పద్మాలయ స్టూడియోస్‌కు అభిమానులు పోటెత్తారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు శ్రమ పడాల్సి వచ్చింది. చివరికి కొంత మందిపై పోలీసులు లాఠీఛార్జి కూడా చేశారు.

CM Jagan pays Tributes to Krishna: సూపర్ స్టార్ కృష్ణకు సీఎం జగన్ నివాళులు

సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి ఏపీ సీఎం జగన్ నివాళులు అర్పించారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న సీఎం జగన్ పద్మాలయ స్టూడియోస్ కు వచ్చారు. అక్కడ కృష్ణ పార్థివదేహం ముందు పుష్పాలను ఉంచి నివాళి అర్పించారు. మహేశ్ బాబు సహా కుటుంబ సభ్యులను పరామర్శించారు.

CM Jagan to Hyderabad: నేడు హైదరాబాద్‌కు సీఎం జగన్, కొద్ది గంటల్లో సూపర్‌ స్టార్‌ కృష్ణకు నివాళులు

సూపర్‌ స్టార్‌ కృష్ణకు నివాళి అర్పించడానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కాసేపట్లో హైదరాబాద్‌కు రానున్నారు. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు. హైదరాబాద్‌ పద్మాలయా స్టూడియోస్‌కు చేరుకుని సూపర్‌స్టార్‌ పార్థివ దేహానికి ఆయన నివాళులర్పిస్తారు. అనంతరం ఘట్టమనేని కుటుంబాన్ని పరామర్శిస్తారు. నేడు ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు పద్మాలయ స్టూడియోలో సూపర్ స్టార్ భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి అంతిమ యాత్ర ప్రారంభం అవుతుంది. సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తారు. 

Superstar Krishna: పద్మాలయ స్టూడియోస్‌లో కృష్ణ భౌతికకాయం

పద్మాలయ స్టూడియోస్‌కు కృష్ణ భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అభిమానుల సందర్శార్థం అక్కడే ఉంచనున్నారు. ఇక్కడికే సీఎం జగన్ కూడా వచ్చి నివాళులు అర్పించనున్నారు. అనంతరం సాయంత్రం ఫిలింనగర్ మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.

Superstar Krishna funeral News: నేడు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు, పద్మాలయ స్టూడియోలో పార్థివదేహం

తెలుగు సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు నేడు అధికార లాంఛనాలతో హైదరాబాదులోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. సోమవారం ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసారు ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు లక్షలాది మంది అభిమానులు ఆయన మృతదేహాన్ని సందర్శించారు ఘనంగా నివాళులు అర్పించారు. అభిమానుల సందర్శనం కోసం మద్యాహ్నం వరకు పద్మాలయా స్టూడియోస్ లో పార్థివదేహం ఉంచుతారు మధ్యాహ్నం మహాప్రస్థానానికి పార్థివదేహం తరలించి ప్రభుత్వ అధికారులు అంచనాలతో అంత్యక్రియలు నిర్వహించినట్లు మహేష్ బాబు కుటుంబసభ్యులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ తో పాటు మరికొంతమంది ప్రముఖులు పద్మలయాస్ స్టూడియోకు రానున్నారు. 

Background

కన్నుమూసిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియల విషయంలో కుటుంబ సభ్యులు కీలక మార్పులు చేశారు. ముందుగా అనుకున్న ప్రకారం కాకుండా పలు మార్పులు చేర్పులు చేశారు. మంగళవారం సూర్యాస్తమయం కావడం వలన అభిమానుల సందర్శనార్ధం సూపర్ స్టార్ కృష్ణ గారి పార్ధివ దేహాన్ని నానక్‌రామ్‌గూడలోని విజయకృష్ణ నిలయం దగ్గరే ఉంచనున్నట్లు ప్రకటించారు. అభిమానులుఅక్కడికే వెళ్లి నివాళులు అర్పించాలని సూచించారు. రేపు (బుధవారం) మధ్యాహ్నం తర్వాత ప్రభుత్వ అధికార లాంఛనాలతో మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ గారి అంత్యక్రియలు జరుగుతాయని ప్రకటించారు.


కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి నానక్‌రామ్ గూడలోని కృష్ణ ఇంటికి భౌతిక కాయాన్ని తరలించారు. మంగళవారం సాయంత్రం వరకూ సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచుతారని ముందుగా ప్రకటించారు. ఆ తర్వాత  గచ్చిబౌలి స్టేడియానికి తరలించి బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు  అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నట్లు చెప్పారు. కానీ, ఈ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు కృష్ణ కుటుంబ సభ్యులు తెలిపారు. నేరుగా విజయ నిర్మల నివాసం నుంచి మహాప్రస్థానానికి కృష్ణ అంతిమయాత్ర కొనసాగుతుందని ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నమే అంత్యక్రియలు పూర్తవుతాయని తెలిపారు.   


అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు


సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు సీఎం సూచించారు. కేసీఆర్ ఆదేశంతో పోలీసుల అధికారిక వందనంతో కృష్ణకు తుది వీడ్కోలు పలకనున్నారు.


కృష్ణకు అభిమానుల ఘన నివాళి 


అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కార్డియాక్‌ అరెస్టుతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. కృష్ణ మరణ వార్త ఆయన కుటుంబ సభ్యులు, తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టింది.  సినీ పరిశ్రమ మొత్తం తరలి వచ్చి కృష్ణ పార్దీవ దేహానికి నివాళులు అర్పిస్తోంది. అన్ని చోట్లా నుంచి అభిమానులు.. తమ జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. 


సూపర్ స్టార్ మృతి పట్ల కేటీఆర్ సంతాపం



తెలుగు సినీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ గారి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రి కే తారకరామారావు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. 350 కి పైగా సినిమాల్లో నటించిన కృష్ణ తెలుగు సినీ ప్రేక్షకుల మనసులలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా ఆయన తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలు అజరామరం అని కొనియాడారు. తెలుగు సినిమా చరిత్రలో విభిన్న తరహ పాత్రలను పోషించడంతోపాటు, అద్భుతమైన సినిమాలను నిర్మించి తెలుగు సినిమా చరిత్రలో తనదైన స్థానాన్ని సూపర్ స్టార్ కృష్ణ సృష్టించుకున్నారన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు సినిమా రంగానికి తీరని లోటన్న కేటీఆర్, కృష్ణ గారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు


- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.