Rains in Andhra Pradesh | అమరావతి/ హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం సముద్రమట్టంపై 5.8 కిలోమీటర్ ఎత్తు వరకు విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరం వైపు చేరే అవకాశం ఉంది. శుక్రవారం నాటికి దాదాపు ఉత్తరం దిశగా ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంట పయనించే అవకాశం ఉందని వెల్లడించారు. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలు, వాటి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాలకు ఎల్లో వార్నింగ్ జారీ అయింది. కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో తేలికపాటి జల్లులు అక్కడక్కడా పడతాయి. 
 
నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు
అల్పపీడనం బలపడిన కారణంగా డిసెంబర్19న ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వీటితో పాటు తూర్పూ గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల,ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వర్షాలు కురిసే సమయంలో చెట్టు కిందకు వెళ్లడం, పాత బిల్డింగ్ ల కింద తల దాచుకోవడం లాంటివి చేయకూడదు. డిసెంబర్ 18న బుధవారం నాడు విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో వర్షం కురిసింది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. 

తెలంగాణ ప్రజల్ని వణికిస్తున్న చలి

తెలంగాణలో గత వారం రోజులనుంచి చలి తీవ్రత పెరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో అయితే అయిదారు డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత అధికంగా ఉందని ఆదిలాబాద్ జిల్లాలో స్కూల్ పనివేళలు సైతం మార్చుతూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

నెం ఏరియా గరిష్ట ఉష్ణోగ్రత కనిష్ట ఉష్ణోగ్రత
1 ఆదిలాబాద్ 28.5  6.7
2 భద్రాచలం  29  18
3 హకీంపేట్  29.4 14.8
4 దుండిగల్   30.4 14.7
5 హన్మకొండ 30.5 13
6 హైదరాబాద్   29.6 14.7
7 ఖమ్మం  31.6 16.6
8 మహబూబ్ నగర్  31.5 18.3
9 మెదక్   29.8 7.8
10 నల్గొండ   26.4 18
11 నిజామాబాద్  31.6 12.8
12 రామగుండం   29.2 12.1

చలి నుంచి జాగ్రత్తలు తీసుకోండి

హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. ఆ సమయంలో వాహనాలు జాగ్రత్తక నడపకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో పగటి పూట ఎండ ప్రభావం చూపుతున్నా, రాత్రివేళ మాత్రం చలికి గజగజ వణికిపోతున్నారు. చెవులకు చల్ల గాలి పోకుండా చూసుకోవాలని, స్వెటర్, మఫ్లర్ లాంటివి వాడాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, రాత్రిపూట వేడి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదని జలుబు, దబ్బు సమస్యలు రావని సూచించారు.

Also Read: Nellore Alert : నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !