Couple Divorce After 43 Years Of Marriage : పెళ్లిళ్లు స్వర్గంలో ఖరారవుతాయని అంటారు అయితే పెళ్లిళ్లు స్వర్గంలో ఖరారు అయినంత మాత్రాన ప్రతి పెళ్లి స్వర్గమవ్వాలని లేదు. నిజానికి చాలా పెళ్లిళ్లు నరకం అవుతాయి. అలా హర్యానాలోని కర్నాల్‌కు చెందిన ఓ వ్యక్తి కి కూడా పెళ్లి నరకం అయింది. కానీ ఆ నరకం నుంచి బయటకు రావడానికి 43 ఏళ్లు పట్టింది. చివరికి విజయం సాధించారు. ఇందు కోసం తన ఆస్తిని అమ్మేసి రూ. మూడు కోట్లను భార్యకు భరణంగా కట్టాడు. 


43 ఏళ్ల కిందట తన జీవితం ఎంతో మధురంగా ఉంటుందని పెద్దలు చూపించిన పెళ్లి సంబంధాన్ని చేసుకున్నాడు. అయితే అతని ఆశలు అడియాశలు కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కానీ పెద్దల ఒత్తిడి భరించలేక ఇష్టం లేకపోయినా అలా సంసారాన్ని ఈదాడు. ముగ్గురు పిల్లలు పుట్టారు. అయితే ఇంట్లో పెద్దవాళ్లందరూ వెళ్లిపోయి.. తనకే పెద్దరికం వచ్చిన తర్వాత మాత్రం ఆ బంధాన్ని తెంచుకోవాలనుకున్నాడు. మొదట 2006లో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. 


Also Read: కోల్‌కతా మెట్రో స్టేషన్‌లో ప్రేమజంట ముద్దు సీన్ - ఈ కిస్సిక్ కరెక్టా కాదా అని వాదులాడుకుంటున్న సోషల్ మీడియా


కానీ భార్య మాత్రం తాను విడాకులు ఇచ్చేది లేదని తేల్చేసింది.  దాంతో ఆ విడాకుల కేసు అలా తేలిపోయింది. తప్పనిసరిగా ఈ  పెళ్లి బంధంలో అతను కొనసాగాల్సి వచ్చింది. పిల్లల బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత మరోసారి 2013లో మరోసారి తనకు విడాకులు కావాలని కోర్టుకెక్కాడు. అక్కడ కోర్టు కౌన్సెలింగ్ చేసింది. చివరికి ఇద్దరూ కలిసి ఉండేలా ఒప్పించింది. అప్పుడు కూడా మన మొగుడుగారు తప్పించుకోలేకపోయారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఎవరు చెప్పినా ఆగకూడదని డిసైడయ్యాడు. 


ఇటీవల కోర్టులో  విడాకుల పిటిషన్ వేశారు. విచారణ హోరాహోరీగా సాగింది. చివరికి ఆ భార్య తనకు రూ. మూడు కోట్లతో పాటు భరణం కూడా ఇస్తే విడిపోతానని చెప్పింది. దాన్ని  కూడా ఇచ్చేందుకు ఆ పెద్దాయన సిద్దపడ్డాడు. వెంటనే తనకు ఉన్న పొలంలో కొంత భాగాన్ని అమ్మేసి .. రెండున్నర కోట్లు చెల్లిచేశారు.  పంటలు చేతికి వచ్చిన తర్వాత మిగతా మొత్తం చెల్లిస్తానని హామీ పత్రం రాసిచ్చారు. కోర్టు కూడా ఆ డబ్బుతో సరి పెట్టుకోవాలని ఇక ప్రత్యేకంగా భరణం ఏమీ ఇవ్వరని ఆ భార్యకు తేల్చి చెప్పేసింది. దీంతో విడాకులు మంజూరయ్యాయి.


Also Read:  మణిపూర్‌ టెర్రరిజానికి ఎలాన్ మస్క్ సాయం - ఉగ్రవాదుల వద్ద స్టార్ లింక్ పరికరాలు - టెస్లా చీఫ్ స్పందన ఇదే !


అయినా జీవిత చరమాంకంలో భార్య తోడుగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు కానీ ఈయన మాత్రం రూ.మూడు కోట్లు చెల్లించేసి మరీ వదిలించుకున్నారు ఏమిటా అని కర్నాల్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మగవాడి కష్టాలేమో ఆయనకే తెలుసని.. ఇంత కాలం టార్చర్ తో బతికి ఉంటాడని.. ఇికనైనా ప్రశాంతంగా బతకాలని కోరుకుని ఉంటారని కొంత మంది సెటైర్లు వేస్తున్నారు. ఎన్నో విచిత్రమైన విడాకుల్లో ఇది కూడా ఒకటికిగా రికార్డులకు ఎక్కింది.