సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల వేడుక ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా సోమవారం నాడు (జూలై 18న) ఎంతో కీలకమైన వేడుక రంగం నిర్వహించారు. భవిష్యవాణి వినిపించిన జోగిణి స్వర్ణలత కీలక విషయాలు చెప్పారు. మొక్కుబడిగా ఎందుకు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం భక్తుల సంతోషం కోసం పూజలు చేస్తున్నారు కానీ, అమ్మవారిని మనసు పెట్టి పూజలు చేయడం లేదన్నారు. అమ్మవారిని అన్నిరూపాలు ఎందుకు మారుస్తారు, పూజలు ఎందుకు సరిగా చేయడం లేదు ? అన్నారు. తన గర్భాలయంలో శాస్త్రోక్తంగా పూజలు సక్రమంగా జరిపించాలని సూచించారు. ఎన్నితప్పులు చేసినా కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నానని అమ్మవారి భవిష్యవాణిని స్వర్ణలత వినిపించారు.
భవిష్యవాణిలో అమ్మవారి ఆగ్రహం..!!
మిమ్మల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. మీరు నా ఆగ్రహానికి గురికావొద్దు. ఇకనుంచి పూజలు సరిగా జరిపించండి. నా రూపాన్ని ఎందుకు మారుస్తున్నారంటూ గర్భాలయ ప్రధాన పూజారులపైనే అమ్మవారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు గర్భిణీలకు ఇబ్బంది లేకుండా చూస్కుంటున్నాను. ప్రతి ఏటా పూజలు ఎలా చేయాలని నన్నే అడుగుతున్నారు. మీరంతా నా బిడ్డలు కనుక నేనుమిమ్మల్ని కాపాడుతున్నానని అమ్మవారి భవిష్యవాణిని స్వర్ణలత వినిపించారు.
అందుకే వర్షాలు..
తన రూపాన్ని ఇష్టం వచ్చినట్లుగా మార్చడం, మీ ఇష్టం ఉన్నట్లు పూజలు నిర్వహించారు. అందుకే నేను మీ కళ్లు తెరిపించేందుకు కుండపోత వర్షాలు కురిపించాననని అమ్మవారు చెప్పారు. ఎన్ని తప్పులు చేసినా నా బిడ్డలేనని క్షమిస్తున్నానని, ఇకనుంచి ఇలాంటి తప్పిదాలు చేయవద్దునని హెచ్చరించారు. పూజలు సరిగా చేయాలని, రూపాలు మార్చవద్దని స్వర్ణలత ద్వారా అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. నా సొమ్మును దొంగలు దోచినట్లు దోచేస్తున్నారు. మీరు నాకు ఇచ్చేది ఏంటి. ఇంతా నాదే. నా దగ్గరి నుంచి మీరు అన్ని దోచుకుంటున్నారంటూ అమ్మవారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఇకనైనా కళ్లు తెరవాలని కుండపోత వర్షాలు కురిపించానని చెప్పారు. నా ప్రజలకు ఈ విషయం తెలియాలని, వారంత కళ్లారా వాస్తవం గ్రహించాలని ఇలా చేశానంటూ స్వర్ణలతతో అమ్మవారు చెప్పించారు.
బోనాలు సమర్పణ..
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు ఆదివారం తెల్లవారుజామున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత మహిళలు, యువతులు నెత్తిన బోనాలతో వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. నిన్న ఎమ్మెల్సీ కవిత సైతం బంగారు బోనం సమర్పించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు కవిత చెప్పారు.