టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు, ఆయన తనయుడు కేటీఆర్‌కు ఉన్న అభిమానులకు కొదవ లేదు. సినీ స్టార్ల స్థాయిలో వారికి పొలిటికల్ ఫాలోయింగ్ ఉంది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి వారు క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్తకు దగ్గరగా ఉంటూ వచ్చారు. ఉద్యమ సమయంలో ఆకట్టుకునేలా చేసిన ప్రసంగాలు, వాగ్ధాటి వంటివి వీరిద్దరికీ ఎంతో ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టాయి. అధికారంలోకి వచ్చాక చేపట్టిన కార్యక్రమాలు, పథకాలు, వారి వ్యవహార శైలి కూడా కేసీఆర్, కేటీఆర్‌కు ను అభిమాన గణాన్ని సంపాదించిపెట్టాయి. అయితే, ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నా ఒక మహిళ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఆమె కేసీఆర్‌కు, కేటీఆర్‌కు వీరాభిమాని. పేరు జిందం సత్తమ్మ. స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా. కేసీఆర్, కేటీఆర్‌కు ఎంత క్లోజ్ అంటే మంత్రి ఎప్పుడైనా సొంత నియోజకవర్గ పర్యటనకు వెళ్తే ఆయన్ను సత్తమ్మ సులభంగా కలిసేంతలా. ఆఖరికి ఎంతో ఆప్యాయంగా కేటీఆర్‌ను ఆలింగనం చేసుకునేంత అభిమానం ఆమె సొంతం. సత్తమ్మ పట్ల కేటీఆర్ కూడా అంతే ఆప్యాయంగా ఉంటారు. తాజాగా జిందం సత్తమ్మ గురించి తొలిసారిగా కేటీఆర్ ప్రకటించారు.
ఆమెతో గతంలో దిగిన ఫోటోలను ట్వీట్ చేశారు. నాలుగు ఫోటోలను కేటీఆర్ ట్వీట్ చేయగా, అందులో ఆమె ఎంతో ఉత్సాహంతో టీఆర్ఎస్ కరపత్రాన్ని చూపిస్తున్న ఫోటో ఉంది. ఎలాంటి కల్మషం లేని ఆమె ముఖంలో తన అభిమాన నేతలు, పార్టీ పత్రాన్ని సగర్వంగా పైకెత్తి చూపిస్తున్నారు.
అంతేకాక, కేటీఆర్ సొంత నియోజకవర్గం పర్యటనలో సత్తెమ్మ చేతిని పట్టుకొని ఉన్న ఫోటో, ఆయన్ను ఆలింగనం చేసుకుంటున్న ఫోటో వైరల్ అవుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కేటీఆర్ పక్కనే ఉండి విజయ చిహ్నం చూపుతున్న ఫోటో కూడా మంత్రి ట్వీట్ చేశారు.
‘‘టీఆర్ఎస్‌కు ఉన్న స్పెషల్ మద్దతుదారును మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. నా సొంత జిల్లాకు చెందిన ఈమె జిందం సత్తెమ్మ. కేసీఆర్ గారికి హార్డ్ కోర్ ఫ్యాన్. సపోర్టర్. ఈమె తెలంగాణ ఉద్యమ సమయం నుంచి నాకు ఒక కీలక మద్దతుదారుగా ఉంది. ఈ అపరిమిత ప్రేమ, ఆప్యాయతకు ధన్యవాదాలు’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.