YS Sharmila Counters CM KCR: తెలంగాణలోని గోదావరి పరీవాహక ప్రాంతంలో విదేశీయులు క్లౌడ్ బరస్ట్ చేశారన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై విపక్షాల నేతలు కౌంటర్ ఇస్తున్నారు. సీఎం వ్యాఖ్యలను పూర్తిగా అర్థం లేనివంటూ వారు కొట్టి పారేస్తున్నారు. ఇప్పటికే ఈటల రాజేందర్ దీనిపై స్పందించగా, తాజాగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా కేసీఆర్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. విదేశీయులు తెలంగాణపై కుట్రలు చేశారనే సమాచారం ఉన్న కేసీఆర్ దొరకు.. వరదలు వస్తాయని, నష్టం తెస్తాయనే అంశంపైన సమాచారం అందలేదా అంటూ కౌంటర్ ఇచ్చారు. వర్షాలు పది రోజులుగా పడుతుంటే కేసీఆర్‌కు ఇవాళ తీరిక దొరికిందా అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి వరుస ట్వీట్లు చేశారు.
వరద బాధిత ప్రజలను చూసేందుకు, వారి బాధలు చూసేందుకు దొర ఇప్పటికైనా గడి నుంచి బయట అడుగు పెట్టారని అన్నారు. మొత్తానికి సుడిగాలి పర్యటన, ఏరియల్ సర్వే చేసి, రాష్ట్రంపై విదేశీ కుట్ర జరుగుతోందని సెలవిచ్చారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వానలు, వరదలకు క్లౌడ్ బరస్ట్ కారణమని కాకమ్మ కథలు చెప్తున్నారని, ఈ వాలకం చూస్తే బోడి గుండుకు మోకాలుకు ముడేసినట్లు ఉందని వ్యాఖ్యానించారు.
వరద ముంచెత్తి నివాసం కోల్పోయి అసలే రూ.లక్షల్లో నష్టపోయిన వరద బాధితులకు కనీసం తక్షణం ప్రకటించిన వరద సాయం అయినా అందిస్తారా? అంటూ ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో వరదలు వచ్చినప్పుడు ప్రకటించిన, వరద సాయాన్ని స్థానిక టీఆర్ఎస్ లీడర్లు మింగేసినట్లుగా ఇప్పుడు కూడా చేస్తారా అంటూ అనుమానం వ్యక్తం చేశారు.
‘‘వారం రోజుల వానల తర్వాత వరద బాధితులకు చూసేందుకు ఇయ్యాల తీరింది దొరకు. హెలీకాప్టర్ లో ఏరియల్ సర్వే చేసి, తెలంగాణపై విదేశీ కుట్ర జరుగుతోందని సెలవిచ్చిండు. వానలు, వరదలు రావడానికి క్లౌడ్ బస్టర్ అని కాకమ్మ కథ చెప్పి, బోడి గుండుకు మోకాళ్ళకు ముడేసిండు. విదేశీ కుట్రల మీద సమాచారం ఉన్న సారుకు.. వరద నష్టం మీద ఎంత సమాచారం అందిందో? లక్షల్లో ఆస్తి నష్టపోయి, గూడు లేని, తిండి అందని వరద బాధితులకు రూ.10 వేల సాయం ప్రకటించిండు. సారు..ఈ సాయమన్న అందుతుందా? GHMC లో వరద సాయమని మీ గులాబీ లీడర్లే మింగినట్టు మింగుతారా? వరంగల్‌లో ఇస్తామని మరిచినట్టు ఇది కూడా ఉత్త హామీనేనా?’’ అని షర్మిల ట్వీట్ చేశారు.
బాసర ట్రిపుల్ ఐటీ అంశంపైన కూడా..
బాసరలోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీలో విద్యార్థులు మళ్లీ నిరసనలు చేయడంపైనా వైఎస్ షర్మిల స్పందించారు. ‘‘రాత్రనకా పగలనకా వర్షంలో తడుస్తూ మా సమస్యలు పరిష్కరించడని బాసర IIIT విద్యార్థులు ధర్నా చేస్తే, దూపైనప్పుడే బాయి తవ్వు కొన్నట్లు చదువుల మంత్రి సబితమ్మ నెల రోజుల్లోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చి జారుకుంది తప్పితే ఇప్పటికీ సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. VC, బోధన సిబ్బంది ముచ్చట దేవుడెరుగు కనీసం కూడు పెట్టే దిక్కులేదు. ఉడకని అన్నం, నీళ్ల చారు, పురుగులు పట్టిన బియ్యం, ముక్కపట్టిన పప్పు ఇవే సర్కార్ హాస్టల్స్ లో విద్యార్థుల ఫుడ్ మెనూ, సన్న బియ్యమని గప్పాలు చెప్పుకొనుడు తప్పితే సక్కటి అన్నం పెట్టే దిక్కులేదు, విద్యార్థులు ప్రాణాలంటే లెక్క లేదా?’’ అని ప్రశ్నించారు.