Tirumala: తిరుపతి : కలియుగంలో భక్తులను రక్షించేందుకు వైకుంఠంను వదిలి భూవిలో శ్రీ మహా విష్ణువు, శ్రీనివాసుడి అవతారంలో వెలసిన దివ్యధామం తిరుమల. శ్రీ వేంకటేశ్వరుడు భక్తుల కోరిన కోర్కెలు తీరుస్తూ, పిలిస్తే పలికే దైవంగా విరాజిల్లుతున్నారు. అందుకే స్వామి వారి క్షణకాలం దర్శనార్థం ప్రతి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఇలా స్వామి వారి దర్శనార్థం తిరుమలకి విచ్చేసిన భక్తులు ఒకానొక సందర్బంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడం అనేక సందర్భంలో చూస్తూనే ఉంటాం. నడక మార్గం నుంచి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు సరైన అవగాహనా లేకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి వారి కోసమే ఈ సలహాలు, సూచనలు..


అస్వస్థతకు గురైతే ఏం చేయాలంటే..
నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఇలా వచ్చే భక్తులు వైకుంఠం 1&2 క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీనివాసుడిని దర్శించుకుంటారు. ప్రతి క్యూ కాంప్లెక్స్ లోను ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు ఉంటాయి.. మీరు దర్శనానికి వెళ్తున్న క్యూలైన్ వెళ్తున్న సమయంలోనూ, కంపార్టుమెంట్ లో వేచి ఉన్న సమయంలో టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ, శ్రీవారి సేవకులు అందుబాటులో ఉంటారు. ఒకవేళ మీరు, లేదా మీ కుటుంబ సభ్యులు, కంపార్టుమెంట్ లో అస్వస్థతకు గురి అయితే వెంటనే అక్కడ ఉన్న శ్రీవారి సేవకులను సంప్రదించాలి. తీవ్ర అస్వస్థతగా అనిపిస్తే, విజిలెన్స్ సిబ్బందికి గానీ టిటిడి సిబ్బందికి గానీ సమాచారం అందించడం ద్వారా, క్యూలైన్ కాంప్లెక్స్, వివిధ ప్రాంతాల్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ (First AID) కేంద్రాలకు తరలిస్తారు. తద్వారా ప్రథమ చికిత్స అనంతరం ఫర్వాలేదు అనుకుంటే దర్శనానికి వెళ్ళాలి. లేదంటే అంబులెన్స్ ద్వారా వెంటనే అశ్విని ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవచ్చు. గుండె సంబంధిత వ్యాధి ఉంటే, అశ్వినిలో ప్రత్యేక అపోలో యూనిట్ ద్వారా చికిత్స పొందవచ్చు. ఇక పాము కాటుకు ప్రత్యేక ఇంజెక్షన్స్ అశ్విని ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి..


ప్రథమ చికిత్స కేంద్రాలు ఎక్కడ ఉన్నాయంటే..
తిరుమల శ్రీవారి దార్శనానికి వచ్చే భక్తులు అధిక భాగం నడక మార్గం గుండా తిరుమలకు చేరుకుంటారు. నడక మార్గం గుండా తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రాధమిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసింది టీటీడీ. నడుచుకుంటూ తిరుమలకు వెళ్తున్న సమయంలో అస్వస్థతకు గురైన, నీరసించిన ప్రాధమిక చికిత్స కేంద్రం ద్వారా వైద్యం పొందవచ్చు. నొప్పుల నుంచి ఇతర సమస్యలకు చికిత్స అందించేందుకు 24/7 వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. తీవ్ర అస్వస్థతకు గురైతే, దగ్గరలో ఉన్న విజిలెన్స్ సిబ్బందిని గానీ, టిటిడి సిబ్బందిని గానీ, భక్తుల కోసం సూచిక బోర్డుల్లో రాయబడిన టిటిడి నెంబర్లకు సంప్రదించడం ద్వారా లైఫ్ సపోర్ట్ కలిగిన అధ్యధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న అంబులెన్స్ సహాయంతో తిరుపతి స్విమ్స్ కు తరలిస్తారు..


తిరుమలలో 108తో పాటుగా టీటీడీ అంబులెన్స్, అపోలో అంబులెన్స్ లు భక్తుల కోసమే..
తిరుమలలో మూడు 108 వాహనాలతో పాటుగా టీటీడీ అంబులెన్స్, అపోలో 24/7 అంబులెన్స్ అందుబాటులో ఉంటాయి. టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి లేదా 108కి సమాచారం అందించడం ద్వారా 10 నిమిషాల్లో మీ వద్దకు అంబులెన్స్ వాహనం వచ్చేస్తుంది. అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగిన అశ్విని ఆసుపత్రిలో చికిత్స పొందవచ్చు. ఒకవేళ పరిస్థితి విషమిస్తే, నేరుగా తిరుమల నుంచి స్విమ్స్, రుయా ఆసుపత్రికి వెళ్ళవచ్చు.