మౌలిక వసతుల రంగంలో హైదరాబాద్ దూసుకెళ్తోంది. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా తెలంగాణ ప్రభత్వం వ్యూహాత్మంగా భారీగా ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టింది. అవన్నీ నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. వరుసగా ఓపెనింగ్‌కు వస్తున్నాయి. కొత్త ఏడాది తొలి రోజున షేక్ పేట ఫ్లై ఓవర్‌ను కేటీఆర్ ప్రారంభించబోతున్నారు. రేతిబౌలి నుంచి ఆరులేన్లతో షేక్ పేట్ , ఫిలింనగర్ జంక్షన్ ఓయూ కాలనీ, విస్పర్ వ్యాలీ జంక్షన్ వరకు ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. షేక్‌పేట్ ఫ్లై ఓవర్ ఇంటర్మిడియట్ రింగ్ రోడ్ నిర్మాణం నగరంలో రెండవ అతి పెద్దది.
Also Read: హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్.. కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం, వంతెనకు అబ్దుల్ కలాం పేరు
పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే తర్వాత 2.8 కిలోమీటర్ల పొడవులో ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. ఈ ఫ్లై ఓవర్‌తో హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి వెళ్లే వాహనదారులకు మహా ఉపశమనం లభించనున్నది. నిర్మాణంలో భాగంగా 74 పిల్లర్స్, 72 పియర్ క్యాప్స్, 440 పి.ఎస్.సి గడ్డర్స్,144 కాంపోసిట్ గ్రీడర్స్ ఏర్పాటు చేశారు. శనివారం నుంచి ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. మూడు రోజుల కిందటే మిథాని- ఒవైసీ ఫ్లై ఓవర్‌ను కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్‌లో అత్యంత బిజీగా రూట్లలో ఒకటి ఎల్‌బినగర్ – చాంద్రాయణగుట్ట రూట్ . ఈ రూట్‌లోనే మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది.
2018లో స్ట్రాటజిక్ రోడ్ డెలవప్‌మెంట్ ప్లాన్ కింద తెలంగాణ సర్కార్ అనేక చోట్ల ఫ్లై ఓవర్ నిర్మాణాలు చేపట్టింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్‌పాస్ నిర్మాణాలు చేపట్టింది. ఇందులో భాగంగా మిథాని- ఒవైసీ ఫ్లై ఓవర్, షేక్ పేట ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఐటీ కారిడార్ ప్రాంతంలో ఇప్పటికే కీలకమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణం పూర్తయింది. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఫ్లైవర్లతో ఎల్బీ నగర్ నుంచి ఐటీ కారిడార్‌కు వచ్చే వారికి ఎంతో సమయం ఆదా అవుతుంది. ఇంకా పలు చోట్ల ఫ్లైఓవర్లు నిర్మాణంలో ఉన్నాయి. అవి కూడా పూర్తయితే హైదరాబాద్ ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మారుతుందన్న అంచనా ఉంది .
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.