పిల్లలపై నిర్వహించిన కొవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను భారత్ బయోటెక్ ప్రకటించింది. దేశంలోని పలు ఆసుపత్రుల్లో భారత్ బయోటెక్ ట్రయల్స్ నిర్వహించింది. 2 నుంచి 18 ఏళ్ల వారిపై నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్‌లో కొవాగ్జిన్‌ ఉత్తమ ఫలితాలను కనబరిచిందని పేర్కొంది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ రెండో దశ, మూడో దశ ప్రయోగాల్లో ఉత్తమ ఫలితాలను కనబరిచినట్లు భారత్‌ బయోటెక్‌ సంస్థ తెలిపింది.


కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ తీసుకున్న పిల్లల్లో.. 1.7 రెట్లు యాంటీబాడీలు వృద్ధి చెందాయని భారత్ బయోటెక్ ప్రకటించింది. ఎలాంటి దుష్పరిణామాలు చూపలేదని చెప్పింది. టీకా వేసుకున్న వారిలో.. రోగనిరోధక శక్తి పెరుగుతున్న విషయం ఈ ప్రయోగాల్లో రుజువైందని చెప్పింది. 
చిన్నారులకు టీకా ఇచ్చేందుకు ఈ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో భారత్‌ బయోటెక్‌ పిల్లలపై కొవాగ్జిన్‌ ప్రయోగాలను జరిపింది. మొత్తం 525 మంది వాలంటీర్లను మూడు విభాగాలుగా విభజించి ప్రయోగాలు చేసింది. 12 నుంచి 18 ఏళ్లు, 6 నుంచి 12 ఏళ్లు, 2 నుంచి 6 ఏళ్ల మధ్య మూడు గ్రూపులుగా విభజించి ట్రయల్స్ చేపట్టారు. అందరిలోనూ రెండో డోస్ ఇచ్చిన నాలుగు వారాల తర్వాత యాంటీ బాడీలు ఉత్పత్తి అయినట్టు భారత్ బయోటెక్ ప్రకటించింది.






'పిల్లలపై కొవాగ్జిన్‌ టీకా జరిపిన ప్రయోగ ఫలితాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి. చిన్నారులకు టీకా సురక్షితం, రోగనిరోధకశక్తి పెంచుతుందనే నిరూపితమైంది. ఈ విషయాన్నీ పంచుకోవడం సంతోషంగా ఉంది. పెద్దవారితోపాటు చిన్నారులకు కూడా సురక్షిత, సమర్థమైన టీకాను అభివృద్ధి చేసే లక్ష్యాన్ని సాధించాం. 2- 18 ఏళ్ల వయసు పిల్లల కోసం ప్రపంచవ్యాప్తంగా తయారైన ఏకైక టీకా కొవాగ్జిన్​ కావటం సంతోషకరం.' అని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్లా చెప్పారు. 


ఇటీవలే.. భారత్‌ బయోటెక్‌ కొవిడ్‌ టీకా కొవాగ్జిన్.. పిల్లల కోసం  అత్యవసర వినియోగానికి డీసీజీఐ(భారత ఔషధ నియంత్రణ మండలి) అనుమతినిచ్చింది. అధికారిక వర్గాలు  ఈ విషయాన్ని వెల్లడించాయి. 12 నుంచి 18 ఏళ్లలోపు వారికి భారత్‌ బయోటెక్ కొవిడ్‌ టీకాను త్వరలో వేయనున్నారు. పిల్లలకు ఇండియాలో మొదటి టీకా కొవాగ్జిన్‌ అవనుంది.  అంతకుముందు భారత్ బయోటెక్.. 2 నుంచి 18 ఏళ్ల వారికి.. వ్యాక్సినేషన్ కోసం క్లినికల్ ట్రయల్స్ డేటాను..సెంట్రల్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కి సమర్పించింది.


Also Read: Omicron Updates: తెలంగాణలో కొత్తగా 5 ఒమిక్రాన్ కేసులు... కొత్తగా 280 కరోనా కేసులు, ఒకరు మృతి


Also Read: Hyderabad Traffic: రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు... ఫ్లైఓవర్లు మూసివేత, ఓఆర్ఆర్ పై కార్లకు నో ఎంట్రీ... ఆంక్షలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు