Hyderabad Crime News: సికింద్రాబాద్‌లో ఈ మధ్య కాలంలో ఆలయాల్లో విగ్రహాలు తరచూ దుండగులు ధ్వంసం చేస్తున్నారు. ఇలాంటి కేసులు ఈ మధ్య కాలంలోన రెండు నమోదు అయ్యాయి. రెండు రోజుల క్రితం ఓ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు విరగొట్టారు. ఆదివారం రాత్రి మరో విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఇది హైదరాబాద్‌లో కాక రేపుతోంది. 


సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌ సమీపంలోని కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహం ధ్వంసమైంది. దీంతో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసమైందని ఉదాయన్నే తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళన చేపట్టారు. దోషులను వెంటనే పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని ప్రభుత్వం కఠినంగా ఉండాలని చెబుతున్నారు.  


ఒక వ్యక్తిని పట్టుకున్న స్థానికులు


ఈ విగ్రహం ధ్వంసం కేసులో ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. ఆ ప్రాంతంలో అనుమాస్పదంగా తిరుగుతున్న వ్యక్తికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. మరికొందుర పరారైనట్టు స్థానికులు చెబుతున్నారు స్థానికులు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం పరారైన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు పోలీసులు . స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నారు. 


ఆలయాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి


విగ్రహం ధ్వంసమైన ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఆలయాన్ని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌తో కలిసి పరిశీలించారు. గుడిలోపలికి వెళ్లి వివరాలపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని దేవాలయాల్లో సీసీ కెమెరాలు పెట్టాలని అన్నారు. 






ఒకరిని అరెస్టు చేసినట్టు చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే


కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శ్రీగణేశ్‌ కూడా ఆలయాన్ని సందర్శించారు. అక్కడి అధికారులు, పోలీసులు, స్థానికులతో మాట్లాడారు. దోషులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్టు చెప్పారు. 


ఇలాంటివి మరోసారి రిపీట్ కానీయొద్దు అంటున్న మాజీ మంత్రి తలసాని


బీఆర్‌ఎస్ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఆలయాన్ని సందర్శించారు. మత విద్వేషాలు ప్రేరేపించే వారిపై కఠినంగా ఉండాలని సూచించారు. నిన్నటి వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో దుర్గామాత నవరాత్రులు, బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారని ఇవాళ విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలతో ఒక వర్గం మనోభావాలు దెబ్బతీయడం మంచిది కాదన్నారు. 


Also Read: జగిత్యాల జిల్లా ఫారెస్ట్ ఆఫీసులో దసరా దావత్ - ప్రభుత్వాఫీస్‌ను బార్‌లో మార్చేసిన అటవీశాఖాధికారులు