Jagtial News: ప్రభుత్వంలో  కీలకమైన శాఖల్లో ఒకటి అటవీశాఖ. అడవులను కాపాడుకుంటూ వన్యప్రాణుల సంరక్షణ చేసుకుంటూ విధులు నిర్వహిస్తుంటారు అటవీ శాఖ అధికారులు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు నిత్యం ఏదో వివాదంలో చిక్కుకుంటున్నారు. "భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టింది" అన్న విధంగా వ్యవహరిస్తున్నారు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు. ఏకంగా ప్రభుత్వ కార్యాలయాన్ని భారం రెస్టారెంట్ గా మార్చుకున్నారు. దసరా పండుగ పురస్కరించుకొని కార్యాలయంలోనే మద్యం మత్తులో చిందులు వేస్తున్నారు...


జగిత్యాల జిల్లా ఫారెస్ట్ ఆఫీసులో దసరా దావత్ ఘనంగా జరుపుకున్నారు ఫారెస్ట్ అధికారులు. దసరా దావత్ లో భాగంగా ఏకంగా ఫారెస్ట్ కార్యాలయంలోనే మద్యం మాంసంతో ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది పార్టీ చేసుకున్నారు.  దావత్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దసరా పడుగా సందర్భంగా జగిత్యాల జిల్లాలోని సామిల్ డిపో యజమానులు దావత్ ఇచ్చినట్టు సమాచారం.




మీడియా ప్రతినిధులు  కనిపించడంతో మాకేమీ సంబంధంలేని విధంగా పారిపోయారు ఫారెస్ట్ అధికారులు. ఈ దావత్ లో జిల్లాలోని సామిల్ యజమానులు, జిల్లా ఫారెస్ట్ సిబ్బంది, కొందరు బీట్, సెక్షన్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో మద్యం సేవించడం ఏంటని  ప్రశ్నించిన మీడియాపై దురుసుగా ప్రవర్తించారు టెక్నికల్ అసిస్టెంట్ లక్ష్మణ్. మద్యం మత్తులో తూలుతున్న కార్యాలయం నుంచి పరుగులెత్తిన ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది.




సమాచారం లేదన్న జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్.


ఇక ఇదే విషయంపై వివరణ కోరగా తమకి ఎలాంటి సమాచారం లేదని ఈ ఘటనలో పాల్గొన్న వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు. ఐతే ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా  మారింది ఫారెస్ట్ అధికారుల వ్యవహారం. ప్రభుత్వ ఉద్యోగులే ఇలాంటి పనులు చేయడం మంచిపద్దతి కాదని సామాన్య ప్రజలు అంటున్నారు . కనీసం ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు అంటున్నారు.




Also Read: సర్వీస్ గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య - మహబూబాబాద్‌లో తీవ్ర విషాదం