Drug Peddlers Arrested in Hyderabad: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.10 లక్షల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ సహాయం చేసిన జాయింట్ ఆపరేషన్ లో ఇద్దరు డ్రగ్స్ విక్రయదారులను పట్టుకుని అరెస్టు చేశారు. వీరు ఇద్దరు నిషిద్ధ నార్కోటిక్ పదార్థమైన ఎండీఎంఏను విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఏ1 నిందితుడి అయిన ప్రదీప్ శర్మ.. రాజస్థాన్ లోని ప్రతాప్ గఢ్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ రాష్ట్రంలో హోంగార్డుగా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ విక్రయాల్లో ఇతనిదే కీలక పాత్ర. ప్రదీశ్ శర్మ.. కామారెడ్డి జిల్లా బిచుకుంద మండలం, పెద్ద దేవాడ గ్రామానికి చెందిన మతంవార్ వీరేంద్ర అనే వ్యక్తిని ఏ2 అని పేర్కొన్నారు. 


వీరిద్దరి నుంచి 215 గ్రాముల MDMA(మిథిలిన్ డయాక్సీ మెథాంఫ్టమైన్) డ్రగ్ (విలువ రూ. 10 లక్షలపైనే), అలాగే రూ. 8,500 నగదుతో పాటు రెండు స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. 


ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీన హైదరాబాద్ మాదాపూర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారం ఆధారంగా పోలీసులు దాడి చేశారు. ఈ అపార్ట్ మెంట్ నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సినీ ఫైనాన్షియర్ వెంకట్, బాలాజీ సహా మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాతో ఇవాళ అరెస్టైన వారికి కూడా లింకులు ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. రాజస్థాన్ కు చెందిన హోంగార్డు ప్రదీశ్ శర్మ.. కామారెడ్డికి చెందిన మతంవార్ వీరేంద్రను సహాయకుడిగా పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. చెక్ పోస్టుల నుంచి డ్రగ్స్ ను వీరేందర్ దాటించేవాడు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ సహా ఇతర ప్రాంతాల్లో జోరుగా డ్రగ్స్ ను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ అక్రమంగా డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. 


Also Read: AP Power Holiday: ఏపీలో పరిశ్రమలకు పవర్ హాలిడే, విద్యుత్ కోతల నేపథ్యంలో నిర్ణయం


రెండ్రోజుల క్రితం శంషాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత


శంషాబాద్ విమానాశ్రయంలో మారోసారి భారీ మొత్తంలో డ్రగ్స్ దొరికాయి. సుమారు రూ. 50 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను అధికారులు పట్టుకున్నారు. సింగపూర్, ఢిల్లీ నుంచి ఈ మాదక ద్రవ్యాలను తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో ఆమేరకు తనిఖీలు నిర్వహించిన డీఆర్ఐ అధికారులు.. 5 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు మహిళల హ్యాండ్ బ్యాగ్ లలో ఈ కొకైన్ ను గుర్తించారు. హ్యాండ్ బ్యాగ్ లలో బ్రౌన్ టేపు వేసి కిలోల మొత్తంలో డ్రగ్స్ తరలిస్తున్నారు.


మాదక ద్రవ్యాలు తరలిస్తున్న వ్యక్తులను డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. లావోస్ నుంచి ఢిల్లీకి.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బ్యాగ్ లో కింది భాగంలో కొకైన్ నింపి తీసుకువస్తున్నారు. నలుగురు ముందస్తు సమాచారం మేరకు మహిళలను తనిఖీ చేయగా డ్రగ్స్ దొరికినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. లావోస్ లో వీరికి డ్రగ్స్ ఎవరు ఇచ్చారు.. హైదరాబాద్ లో ఎవరికి డెలివరీ చేయాలని వచ్చారు అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.