AP Power Holiday: ఆంధ్రప్రదేశ్ ను విద్యుత్ కష్టాలు వేధిస్తున్నాయి. చాలా రోజులుగా డిమాండ్ కు తగ్గ సప్లై లేకపోవడం వల్ల విపరీతమైన విద్యుత్ కోతలతో ఏపీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విద్యుత్ కష్టాలు ఇప్పట్లో తీరే అవకాశాలు కనిపించకపోవడంతో.. విద్యుత్ పంపిణీ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రంలోని పరిశ్రమలకు వారానికి ఒకరోజు పవర్ హాలిడే ప్రకటించారు. మార్కెట్ లో కూడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో మంగళవారం నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు వారంలో ఒక రోజు పవర్ హాలిడే అమలు చేయాలని నిర్ణయించారు. వైద్య సంబంధిత పరిశ్రమలతో పాటు రైస్ మిల్లులకు మాత్రమే పవర్ హాలిడే నుంచి మినహాయింపు ఇచ్చారు. పవర్ హాలిడే కోసం పంపిణీ సంస్థలు విజ్ఞప్తి చేయడంతో విద్యుత్ నియంత్రణ మండలి అనుమితిని ఇచ్చింది.


గృహ అవసరాలకు, వ్యవసాయ విద్యుత్ వినియోగానికి అవసరమైన నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు పరిశ్రమలకు పవర్ హాలిడే అమలుకు అనుమతి ఇవ్వాలని విద్యుత్ పంపిణీ సంస్థలు విజ్ఞప్తి చేయగా.. ఆమేరకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి అంగీకారం తెలిపింది. సెప్టెంబర్ 5 నుంచి 15వ తేదీ వరకు షరతులతో కూడిన పవర్ హాలిడేకి అనుమతి ఇస్తూ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ఏపీఈఆర్సీ ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు ప్రకటించారు. గృహ, పారిశ్రామిక రంగాలతో పాటు వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు, ప్రభుత్వం కృషి చేస్తున్నా, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఏర్పడిన విద్యుత్ సరఫరాలో కొర ఇబ్బందికరంగా ఉంటోంది.


ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ అవసరాలకు ప్రస్తుతం 230 మిలియయన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉందని, థర్మల్, హైడల్, గ్యాస్, పవన, సోలార్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 40 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత వల్ల సమస్యలు ఎదురు అవుతున్నాయి. వర్షాలు లేకపోవడంతో వ్యవసాయానికి బోర్లపై ఆధారపడాల్సివస్తోంది. దీంతో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, డిమాండ్ స్థితి, విద్యుత్ కొనుగోళ్ల పరిమాణం, వాటి ప్రస్తుత ధరలను పరిశీలించిన కమిషన్.. రాష్ట్రంలోని పరిశ్రమల విద్యుత్ వినియోగంపై నియంత్రణ చర్యలను చేపట్టేందుకు అనుమతి ఇచ్చంది. 


పవర్ హాలిడే నిబంధనలు


పరిశ్రమలు ప్రస్తుతం అమలు చేస్తున్న వారానికి ఒక రోజు వారాంతపు సెలవుకు అదనంగా మరో రోజు పవర్ హాలిడే అమలు చేయాల్సి ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు ఒక షిఫ్ట్ మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. సాయంత్రం 6 గంటల తర్వాత విద్యుత్ ఉపయోగించకూడదు.  పరిశ్రమలు రోజువారీ విద్యుత్ వినియోగంలో 70 శాతం వినియోగించుకునే విధంగా ఆయా పరిశ్రమలు అవసరమైన చర్యలు చేపట్టాలి. పవర్ హాలిడేని జిల్లాల వారీగా రెగ్యులేట్ చేస్తారు. ఈ నెల 5 నుంచి 15వ తేదీ వరకు అంటే 2 వారాలు పవర్ హాలిడే అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు.