సినిమాలను కేవలం వినోదం కోసం చూడాల్సింది పోయి, హీరో చేసిన స్టంట్స్, వారి అలవాట్లను ట్రై చేసి హైదరాబాద్‌కు చెందిన ఓ 15 ఏళ్ల విద్యార్థి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. యువతపై సినిమాల ప్రభావం ఏ మేర ఉందో చెప్పడానికి నగరంలో జరిగిన ఈ ఘటన ఉదాహరణ. కన్నడ నటుడు యష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కేజీఎఫ్ ఛాప్టర్ 2. ఈ మూవీలో హీరో సిగరెట్స్ చాలా స్టైలిష్‌గా కాలుస్తాడు. రాకీ భాయ్ చేసినట్లుగా ఓ స్టూడెంట్ చేయాలని ట్రై చేసి తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు. 


అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్‌కు చెందిన ఓ 15 ఏళ్ల విద్యార్థి ఈ మధ్య కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా చూశాడు. వరుసగా రెండు రోజుల్లో మూడు నాలుగుసార్లు మూవీ చూసిన విద్యార్థి తాను కూడా రాకీ భాయ్‌గా సిగరెట్లు కాల్చాలని భావించాడు. రాకీ భాయ్‌లా చేద్దామని, ఒక్కసారిగా సిగరెట్ ప్యాకెట్ మొత్తం తాగేశాడు. అందులోనూ చిన్న కుర్రాడు కావడంతో తీవ్రమైన దగ్గు, గొంతు నొప్పి సమస్యలు రావడంతో కుటుంబసభ్యులు బాలుడ్ని సెంచురీ ఆసుపత్రిలో జాయిన్ చేసి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్నారు. 


కేజీఎఫ్ 2లో రాకీ భాయ్ లాగా తాను కూడా సిగరెట్లు తాగే ప్రయత్నం చేశాడని, అందులో భాగంగా ఒకటే సారి సిగరెట్ బాక్స్ మొత్తం తాగాడని తల్లిదండ్రులు తెలిపారు. సినిమా ప్రభావంతో బాలుడు ఇలా చేశాడని, చిన్న వయసులో తెలిసి తెలియక చేసే పొరపాట్లు పెద్ద పెద్ద తప్పిదాలకు కారణం అవుతాయని వైద్యులు చెప్పారు. కొందరు యువకులు ఇదివరకే సినిమాల్లో హీరోలు చేసిన ప్రమాదకర స్టంట్స్ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకున్న ఘటనలు చాలా చూశాం. ఈ బాలుడు కూడా రాకీ భాయ్ యష్ కేజీఎఫ్ 2లో తాగినట్లుగా సిగరెట్స్ తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఒక్కసారి ప్యాకెట్ సిగరెట్స్ మొత్తం తాగడంతో శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. తన తల్లిదండ్రులకు విషయం చెప్పగా.. వాళ్లు వెంటనే బంజారాహిల్స్‌లోని సెంచురీ ఆసుపత్రిలో చేర్పించారు. 


ప్రస్తుతం స్మోకింగ్ చేస్తున్న వారిలో 87 శాతం 18 ఏళ్లలోపు తొలిసారి సిగరెట్ ట్రై చేశారు. 95 శాతం స్మోకర్స్ 21 ఏళ్లలోపు తొలి సిగరెట్ తాగారని పలు సర్వేలలో వెల్లడైంది. సినిమాలు చూసి అందులో చూసిన సీన్లు మీరు చేయాలని ట్రై చేయకూడదని యువతకు వైద్యులు, పోలీసులు, అధికారులు సూచించారు.


Also Read: Weather Updates: నెమ్మదించిన నైరుతి రుతుపవనాలు - హీటెక్కుతోన్న ఏపీ, తెలంగాణ, రెండు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ