Hyderabad Crime News: దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మీర్‌పేట మాధవి హత్య కేసులో సంచనల విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ సైనికుడైన గురుమూర్తి తన భార్యను దారుణంగా హత్య చేయడమే కాకుండా అత్యంత పాశవికంగా శరీరా భాగాలను ఉడికించి మరీ మృతదేహం ఆనవాళ్లు లేకుండా చేశాడు. అయితే ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా విచారించగా ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
కేసు నుంచి ఎలాగైనా తప్పించుకోవడానికి నిందితుడు మృతదేహం భాగాలను కుక్కర్‌లో కాకుండా హీటర్ సాయంతో విడతల వారీ ఉడికించాడని తెలిసింది. ఇందుకోసం అతను పొటాషియం హైడ్రాక్సైడ్ వాడినట్లు పోలీసులు గుర్తించారు.
రాష్ట్రంలోనే అరుదైన కేస్‌గా పోలీసులు తేల్చారు....
క్లూస్‌ను సేకరించేందుకు పోలీసులు అత్యాధునిక టెక్నాలజీ వాడినట్లు తెలిసింది. నిందితుడు గురుమూర్తి తన భార్య మృతదేహాన్ని మాయం చేసేందుకు ఎంతో తెలివిగా ప్లాన్ చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికిన తర్వాత.. వాటిని ఉడికించడానికి పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణంతో ఉడికించాడు. మృతదేహాన్ని నరికేందుకు కత్తి, చెక్క, మొద్దును కూడా వినియోగించాడని తెలిసింది. వీటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
కారణాలివేనా..
నిందితుడు గురుమూర్తికి మాధవి బంధువుల అమ్మాయితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై దంపలు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఇటీవల వారి బంధువుల ఇంట్లో జరిగిన వేడుకల్లో అత్తమామలు వ్యవహరించిన తీరు గురుమూర్తికి మరింత కోపం తెప్పించినట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధంతోపాటు అత్తమామలు చేసిన అవమానం మనసులో పెట్టుకున్న అతను తరచూ భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలోనే సంక్రాంతి చేసుకునేందుకు భార్య, పిల్లలతో కలిసి నగరంలోని తన సోదరి ఇంటికి వెళ్లాడు. పిల్లలకు సెలవులు కావడంతో అక్కడే వదిలేసి జనవరి 14న భార్యను తీసుకుని ఇంటికి వచ్చాడు. ఆ మరుసటి రోజు రాత్రి భార్యతో గొడవపడిన గురుమూర్తి.. ఆగ్రహంతో తలపై బలంగా బాదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
ఆనవాళ్లను ఎలా గుర్తించారంటే..
భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న గురుమూర్తి.. ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడేందుకు మృతదేహం ఆనవాళ్లు లేకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో రాత్రంతా యూట్యూబ్‌లో వీడియోలు చూశాడు. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ 'సూక్ష్మదర్శిని' వెబ్ సిరీస్ స్ఫూర్తితోనే హత్యలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. సూక్ష్మదర్శిని వెబ్‌సీరిస్‌లో దత్తత తీసుకున్న కుమార్తెను తల్లి, సోదరుడు చంపేస్తారు. ట్యాంకులో వేసి కెమికల్స్ పోసి డెడ్‌బాడీని కరిగించేస్తారు. ఆ నీళ్లను వాష్ రూమ్ ఫ్లష్ ద్వారా వదులుతూ ఉంటారు. అదే సీన్‌ను ఇక్కడ రిపీట్ చేసినట్టు తేలింది.
Also Read: స్కూల్ టాయిలెట్‌లో మద్యం సీసాలు - సమాచారం ఇచ్చారని విద్యార్థులపై టీచర్ దాడి, కర్నూలు జిల్లాలో ఘటన
జనవరి 16న మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లి ముక్కలు చేశాడు. ఆ రోజంతా అదే పనిలో ఉన్న నిందితుడు.. రాత్రి వాటిని బకెట్లో వేసి హీటర్‌తో ఉడికించాడు. ఇందు కోసం పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని వినియోగించాడు. ఎముకలను పొడి చేసిన తర్వాత దాన్ని బాత్రూం ఫ్లస్ ద్వారా డ్రైనేజీలోకి పంపించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దారుణాన్ని అతను మూడు రోజుల పాటు చేసినట్లు తెలిసింది. ఆ సమయంలో ఇంటి యజమాని తన కుటుంబంతో సహా బెంగళూరులో ఉన్నాడు. అలాగే పిల్లలు కూడా ఇంట్లో లేకపోవడంతో ఈ ఘాతుకం బయటికి రాలేదు.
వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతిని పెళ్లి చేసుకోవడం కోసమే ఇలా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆనవాళ్లు లేకుండా చేయడానికి నిందితుడు ఎంతగానో ప్రయత్నించినా మృతదేహాన్ని ముక్కలు చేసిన మొద్దు, గదిలోని వస్తువులపై మానవ అవశేషాలను పోలీసులు బ్లూరేస్ టెక్నాలజీ ద్వారా కనిపెట్టగలిగారు. దీంతో నిందితుడు పోలీసులకు చిక్కాడు. ఆనవాళ్లు దొరకవని గ్రహించిన పోలీసులకే సవాల్ చేశాడు. తాను నేరం చేసినా నిరూపించే సాక్ష్యాలు మీ వద్ద ఏం ఉన్నాయని పదే పదే ప్రశ్నించాడు. దాదాపు వారంరోజుల పాటు శ్రమించిన పోలీసులు చివరకు సాక్ష్యాలు సంపాదించగలిగారు.
Also Read: కదల్లేని వృద్ధులను సైతం ఈడ్చుకొచ్చి కాల్చేస్తున్నారు, మావోయిస్టుల అంతం అమిత్ షా వల్ల కాదు