Drunken Teacher Beats Up Students In Kurnool District: కర్నూలు జిల్లాలో (Kurnool District) దారుణం జరిగింది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే దారి తప్పాడు. మద్యం మత్తులో వారిని చితకబాదాడు. ఈ విషయం మంత్రి లోకేశ్ దృష్టికి వెళ్లగా.. ఆయన ఆదేశాలతో ఉన్నతాధికారులు సదరు టీచర్‌ను సస్పెండ్ చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. హొళగుంద మండలం ముద్దటమాగి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 160 మంది విద్యార్థులు చదువుతుండగా.. జయరాజు అనే టీచర్ ఏకోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. పాఠశాల టాయిలెట్‌లో మద్యం సీసాలను గుర్తించిన విద్యార్థులు.. టీచర్‌కు చెప్పగా ఆయన ఆగ్రహంతో ఊగిపోయాడు. విద్యార్థులను ప్లాస్టిక్ పైప్‌తో చితకబాదాడు.
తల్లిదండ్రుల ఆందోళన
ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఎంఈవో పాఠశాల వద్దకు చేరుకుని తల్లిదండ్రులను కలిసి మాట్లాడారు. విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుడు నిత్యం మద్యం సేవించి పాఠశాలకు వస్తున్నారని ఎంఈవో వద్ద విద్యార్థులు వాపోయారు.
స్పందించిన మంత్రి లోకేశ్
అటు, ఈ ఘటనపై మంత్రి లోకేశ్ స్పందించారు. మద్యం మత్తులో ఉపాధ్యాయుడు విద్యార్థులను చితకబాదాడన్న వార్త తనను తీవ్ర విస్మయానికి గురి చేసిందన్నారు. సదరు టీచర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా విద్యా శాఖ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మంత్రి ఆదేశాల మేరకు ఉపాధ్యాయున్ని సస్పెండ్ చేస్తూ డీఈవో ఆదేశాలిచ్చారు.
విద్యార్థుల కిడ్నాప్
మరోవైపు, ఇదే కర్నూలు జిల్లాలో విద్యార్థుల కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. సి.బెళగల్‌లోని గురుకుల పాఠశాలలో విద్యార్థులను దుండగులు అపహరించారు. భోజన విరామ సమయంలో బయట ఆడుకుంటున్న 6, 7 తరగతి విద్యార్థులు సూర్యతేజ, నవీన్‌ను కిడ్నాప్ చేశారు. జీపులో వచ్చి వీరిని అపహరించినట్లు స్థానికులు తెలపగా.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కిడ్నాప్ అయిన ఇద్దరు విద్యార్థులూ బంధువులేనని.. కుటుంబ కలహాలతోనే వీరిని అపహరించి ఉండొచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. విద్యార్థుల కోసం తీవ్ర గాలింపు చేపట్టి.. ఎమ్మిగనూరులో వీరిని గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు.