MLA Vs Ex MLA Fighting In Uttarakhand: నడిరోడ్డుపై ఓ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వీరంగం సృష్టించారు. పరస్పరం తుపాకులతో కాల్పులు జరుపుకొంటూ రాళ్లు రువ్వుకున్నారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రూర్కీలో బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ ఛాంపియన్, స్వతంత్ర ఎమ్మెల్యే ఉమేశ్ కుమార్ మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ప్రణవ్ సింగ్ ఆదివారం తుపాకులు చేతపట్టి తన అనుచరులతో కలిసి ఖాన్‌పూర్ స్వతంత్ర ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఆయనతో పాటు అనుచరులు సైతం హల్చల్ చేశారు. ఎమ్మెల్యే కార్యాలయంపై కాల్పులు జరపడం సహా రాళ్లు రువ్వి దుర్భాషలాడారు.
అయితే, దీనికి ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ (Umeshkumar) సైతం దీటుగా స్పందించారు. తన అనుచరులతో కలిసి ప్రణవ్ సింగ్ కార్యాలయానికి వెళ్లి తుపాకీతో కాల్పులు జరపడం సహా దుర్భాషలాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇద్దరు నేతలపైనా కేసులు నమోదు చేశారు. మరోవైపు, ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ శనివారం రాత్రి లంధౌరాలోని తన భవనంపై దాడి చేశాడని, తనను దుర్భాషలాడినట్లు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ ఆరోపించారు. దీనిపై స్పందించిన పోలీసులు తనను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఇది చాలా అన్యాయమని.. దీనికి వ్యతిరేకంగా పోరాడతానని అన్నారు.
కాగా, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ మధ్య చాలాకాలంగా విరోధం నెలకొంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒకరికొకరు ఆరోపించుకోవడం సహా విమర్శలు చేసుకోవడంతో వివాదానికి దారి తీసింది. దీంతో వీరిద్దరి వద్ద ఉన్న తుపాకుల లైసెన్స్ రద్దు కోసం జిల్లా మేజిస్ట్రేట్‌కు సిఫార్సు చేస్తామని పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.