Pawan once again tweeted on Amazon gift cards : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అమెజాన్ గిప్టు కార్డుల అంశంపై మరోసారి స్పందించారు. అమెజాన్ గిఫ్ట్ కార్డ్‌లో డబ్బును లోడ్ చేసేటప్పుడు సింపుల్ గా లావాదేవీ పూర్తి అయిపోతుందన్నారు. గడువు ముగిసిన గిఫ్ట్ కార్డ్ నుండి బ్యాలెన్స్‌ను తిరిగి పొందడానికి ఇలాంటి సలువైన ప్రక్రియ లేదన్నారు. వినియోగదారులు కస్టమర్ సేవను సంప్రదించాలి, వారి పరిస్థితిని వివరించాల్సి ఉంటుందన్నారు. సుదీర్ఘమైన,కష్టమైన విధానాన్ని అనుసరించాల్సి ఉందన్నారు. అలా కాకుండా ఉపయోగించని బ్యాలెన్స్‌ను సోర్స్ ఖాతాకు లేదా లింక్ చేసిన బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసే సులువైన మార్గాన్ని ఎందుకు అమలు చేయరని పవన్ ప్రశ్నించారు. ఇలా చేయడం వల్ల వినియోగదారులు వారి గిఫ్ట్ కార్డ్ వోచర్ డబ్బులను కోల్పోరన్నారు. దీనికి పరిష్కారం వెదకాలని అమెజాన్ ఇండియాను పవన్ కోరారు. అలాగే ఆర్బీఐ, నిర్మలా సీతారామన్ ను కూడా ట్యాగ్ చేశారు.
25వ తేదీన పవన్ ఇదే అంశంపై మొదటి సారి ట్వీట్ చేశారు. అమెజాన్ లో గిఫ్టు కార్డులు కొన్న వారు నష్టపోతున్నామని ఫిర్యాదు చేయడంతో స్పందించారు. ఏడాది గడువు ముగిసిన గిఫ్ట్ కార్డుల నుండి బ్యాలెన్స్‌లను కోల్పోయే సమస్యను జనసేన ఆఫీస్ కూడా ఎదుర్కొందన్నారు. చాలా మంది వినియోగదారులు కష్టపడి సంపాదించిన డబ్బు అమెజాన్ గిఫ్టు కార్డుల్లో నిలిచిపోతోందని.. చివరికి అది అందకుండా పోతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
అమెజాన్ ఇండియాలో 1 బిలియన్ కంటే ఎక్కువ గిఫ్ట్ కార్డులు కొనుగోలు చేశారని.. గుర్తు చేశారు. ప్రీపెయిడ్ చెల్లింపు పరికరాలపై RBI మార్గదర్శకాల ప్రకారం, అన్ని PPIలు కనీసం ఒక సంవత్సరం చెల్లుబాటును కలిగి ఉండాలని పవన్ స్పష్టం చేశారు. ఒక సంవత్సరం పాటు ఉపయోగించుకోకపోతే ముందస్తు నోటీసు తర్వాత మాత్రమే ఖాతాను ఇనాక్టివ్ చేయాలన్నారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన అమెజాన్ పే..
ఈ అంశంపై అమెజాన్ స్పందించింది. ‘Amazon.inలో షాపింగ్‌ను కస్టమర్లు ఆస్వాదిస్తుంటారు. మా కో-బ్రాండెడ్ గిఫ్ట్ కార్డ్‌లు అత్యంత ప్రజాదరణ పొందాయి. ఆ గిఫ్ట్ కార్డులను లక్షల మంది ఇష్టపడతారు. Amazon.inలో గిఫ్ట్ కార్డ్‌లను ఈజీగా రీడీమ్ చేయవచ్చు. 10,000కు పైగా యాప్‌లలో నిత్యం ఏదో ఒక షాపింగ్ చేసి వాటిని రీడిమ్ చేసే ఛాన్స్ ఉంది. గడువు తేదీ ముగియకముందే కొనుగోలుదారుకు గిఫ్ట్ కార్డ్ పై 2 రిమైండర్‌లను పంపుతారు. గడువు ముగిసిన తర్వాత సైతం కస్టమర్ కేర్‌ను సంప్రదిస్తే గడువు ముగిసిన గిఫ్ట్ కార్డులను రీ యాక్టివేట్ చేస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు, మార్గదర్శకాలకు మేం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని’ అమెజాన్ పే ఓ ప్రకటన విడుదల చేసింది.