AP CM Chandrababu Comments On State Debts: అప్పులు చేసి తిరిగి చెల్లించే శక్తి మన రాష్ట్రానికి లేదని.. అందుకే గత ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలను సైతం తాకట్టు పెట్టిన దుస్థితి వచ్చిందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. 2022 - 23 ఆర్థిక ఏడాదికి నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికపై సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 'స్టేట్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ - 2025' నివేదికపైనా ప్రజెంటేషన్ ఇచ్చారు. నీతి ఆయోగ్ (Niti Aayog) నివేదికను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. గత ఐదేళ్లలో వచ్చిన డబ్బును ఏం చేశారో తెలియడం లేదని.. తెచ్చిన అప్పులను ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడితే ఆదాయం పెరగదని అన్నారు. గతంలో చేసిన అప్పులకు వడ్డీలు కట్టడం కూడా ప్రస్తుతం కష్టతరంగా మారిందని తెలిపారు.
'అభివృద్ధితోనే సంపద'
అభివృద్ధి పనులపై ఎక్కువగా నిధులు ఖర్చు చేయాలని.. అభివృద్ధి పనుల వల్లే సంపద పెరుగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. 'రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ప్రజలపై పన్నుల భారం పడుతుంది. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేని పరిస్థితి ఎదురవుతుంది. ఆరోగ్యంపై మనం ఎప్పుడూ దృష్టి పెడతాం. ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా చేయగలం. అనారోగ్యంతో ఉంటే ఇంట్లో అందరికీ ఇబ్బందులు వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే అభివృద్ధి పనులు సరిగా చేయలేం. ఇదే కొనసాగితే చివరికి ప్రజలే బాధపడతారు. రాష్ట్ర, దేశ భవిష్యత్ కోసం అందరూ ఆలోచించాలి.' అని సీఎం పేర్కొన్నారు.
18వ ర్యాంకులో ఏపీ
'2022 - 23 ఆర్థిక ఏడాదిలో రూ.67 వేల కోట్ల అప్పులు తెచ్చినా వీటిని కనీస స్థాయిలో కూడా అభివృద్ధి ప్రాజెక్టులకు వినియోగించలేదు. వచ్చిన డబ్బులతో వైసీపీ ప్రభుత్వం దుబారా ఖర్చులు చేసింది. వైసీపీ హయాంలో ఎక్కువ వడ్డీకి అప్పులు తేవడం, మూలధన వ్యయం లేకపోవడం, పన్నులు పెంచడం వంటి వివిధ అంశాల వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. తలసరి ఆదాయంలో కూడా పొరుగు రాష్ట్రాలతో పోల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రజల కొనుగోలు స్థితి కూడా తగ్గింది. అందుకే రాష్ట్రానికి వృద్ధి రేటు అనేది చాలా ముఖ్యమని మా ప్రభుత్వం పదే పదే ప్రస్తావిస్తోంది.' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
'ప్రజలే ఫస్ట్' అనేదే నినాదం
మరోవైపు, 'ప్రజలే ఫస్ట్' అనే విధానంలో ప్రజల అభిప్రాయాలు, అంచనాల మేరకు పని చేయాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పష్టం చేశారు. 7 శాఖల్లో పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై సేకరించిన సర్వే ఫలితాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఐవీఆర్ఎస్‌తో పాటు వివిధ రూపాల్లో లబ్ధిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా శాఖల పనితీరుపై సమీక్షించారు. పింఛన్ల పంపిణీ, దీపం పథకం అమలు, అన్న క్యాంటీన్ల నిర్వహణ, ఇసుక సరఫరా వంటి పథకాలు, పాలసీలపై వివిధ రూపాల్లో సమాచారం సేకరించారు. గ్రామస్థాయి వరకు సిబ్బంది, ఉద్యోగులు, అధికారులపై వచ్చిన ఫీడ్ బ్యాక్‌పైనా అధికారుల నివేదిక తీసుకున్నారు. ప్రజల సంతృప్తి అంశంలో క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితుల ఆధారంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం తెలిపారు.
Also Read: Andhra News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - వారికే ఉచిత ఇంటి స్థలం, మార్గదర్శకాలివే!