AP Government Key Guidelines For Free House Plots: ఏపీ ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. దారిద్ర్య రేఖకు దిగువన (BPL) ఉన్న కుటుంబాలకే ఉచిత ఇంటి స్థలం కేటాయించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి వివిధ అర్హత నిబంధనలు పేర్కొంటూ సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్ ఇస్తుందని.. పదేళ్ల కాలపరిమితితో ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించేలా కన్వేయన్స్ డీడ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. జీవిత కాలంలో ఒకసారే ఇంటి పట్టా ఇచ్చేలా గైడ్ లైన్స్ రూపొందించారు. ఇంటి పట్టా ఇచ్చిన రెండేళ్లలోగా నిర్మాణం చేపట్టాలని సర్కారు తెలిపింది. లబ్ధిదారులకు రాష్ట్రంలో ఎక్కడా ఇంటి స్థలం, సొంతిల్లు ఉండకూడదని నిబంధన విధించింది. కేంద్ర, రాష్ట్ర గృహ నిర్మాణ పథకాల్లోనూ లబ్ధిదారులుగా ఉండకూడదని స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 1 నుంచి కొత్త పథకం
కాగా, రాష్ట్రంలో అర్హులందరికీ ఇళ్లు ఇవ్వడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారధి ఇటీవల స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రామీణ పేదలకు 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం కేటాయించాలని ఇటీవల కేబినెట్ భేటీలో నిర్ణయించారు. 'అందరికీ ఇళ్లు' పథకం పేరుతో మహిళల పేరుతో ఇళ్లు కేటాయించనున్నట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది. ఏజెన్సీల ద్వారా పేదల ఇళ్లు నిర్మించనుండగా.. స్థలం లేదా ఇల్లు పొందిన వారికి పదేళ్ల తర్వాత హక్కులు లభించనున్నాయి. ఆధార్, రేషన్ కార్డుకు ఫ్లాట్ అనుసంధానం చేయనున్నారు.
'వారిపై చర్యలు'
అటు, పేదలకు చెందిన భూముల వివరాలు మార్చే ప్రయత్నం చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో చేసిన భూ అరాచకాలతో ప్రజలకు తీవ్ర సమస్యలు తలెత్తాయని.. వాటిని రెవెన్యూ సదస్సుల ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అమరావతిలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 'సింహాచలం పంచగ్రామాల భూముల సమస్యపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుని పరిష్కరిస్తాం. రిజిస్ట్రేషన్ విలువల హేతుబద్ధీకరణ త్వరలోనే ఉంటుంది. గుంటూరు, మార్కాపురం తదితర ప్రాంతాల్లో బుక్ వాల్యూ తక్కువే ఉంది. కొన్నిచోట్ల తగ్గిస్తే.. మరికొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయి. నాలా పన్ను కూడా రేషనలైజ్ చేస్తున్నాం. గ్రోత్ కారిడార్లలో రిజిస్ట్రేషన్ విలువల పెంపు ఉంటుంది. రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని నిర్ణయించాం.' అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయని.. దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబును చాలా మంది పారిశ్రామికవేత్తలు కలిసి హామీ ఇచ్చారని మంత్రి అనగాని చెప్పారు. వైసీపీ నిర్బంధాలకు వ్యతిరేకంగా నారా లోకేశ్ చేసిన 'యువగళం' పాదయాత్రకు సోమవారంతో రెండేళ్లు పూర్తైందని చెప్పారు. జగన్ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులన్నీ అధిగమించి లోకేశ్ పాదయాత్ర చేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు.