Hyderabad Rains: దక్షిణ అండమాన్ సముద్రంలో అలజడి తెలుగు రాష్ట్రాలను వర్షాలతో ముంచెత్తింది. ముఖ్యంగా హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, సరూర్ నగర్, దిల్‌సుఖ్ నగర్, చైతన్యపురి, నాగోల్, ఖైరతాబాద్, అమీర్‌పేట, పంజాగుట్ట, వెస్ట్ మారేడ్ పల్లి, సికింద్రాబాద్, అంబర్ పేట, చిలకలగూడ, బోయిన్ పల్లి, తిరుమలగిరి, గుడిమల్కాపూర్, నాచారం, గోషామహల్, బాలానగర్, కాచిగూడ , గన్‌ఫౌండ్రీ, శివరాంపల్లి, కుషాయిగూడ, ఈసీఐఎల్, కూకట్ పల్లి, జగద్గిరిగుట్ట, కాప్రా ప్రాంతాల్లో బుధవారం వేకువజాము వరకు భారీ వర్షం (Heavy Rain Lashes Parts Of Hyderabad) కురిసింది.
భారీ వర్షం కారణంగా పవర్ కట్..
భారీ వర్షం కురుస్తున్న సమయంలో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమై పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అమీర్ పేట, మలక్ పేట, దిల్‌సుఖ్ నగర్, చైతన్యపురి, జూబ్లీహిల్స్, యూసఫ్‌గూడ, కొత్తపేట, ఎల్బీనగర్, వనస్థలిపురం, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో బుధవారం ఉదయం పవర్ కట్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో మోకాల్లోతు నీళ్లు నిలిచిపోగా, హైదరాబాద్‌లోని మరికొన్ని ఏరియాలలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. చెట్లు విరిగిపడటంతో కొన్ని ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లుతున్నాయి. ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి మైత్రీవనం స్టేట్‌హోమ్ వద్ద రోడ్డుపై చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. అధికారులు వాటిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.
భారీ ట్రాఫిక్..
అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం ముందుగానే హెచ్చరించింది. ఈ క్రమంలో నిన్న రాత్రి నుంచి నేటి ఉదయం వరకు కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్, పరిసర ప్రాంతాలు చికురుటాకులా వణికిపోయాయి. భారీ వర్షంతో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఎల్బీనగర్ వద్ద రోడ్డు మీద ఉన్న గుంతలో కారు ఇరుక్కుపోయింది. అదే ఏరియాలో ఆర్టీసీ బస్సు వర్షపు నీటిలో చిక్కుకుపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
హైదరాబాద్‌లో ఏ ప్రాంతాల్లో వర్షపాతం ఎలా ఉందంటే..
సికింద్రాబాద్‌లోని సీతాఫల‌్‌మండిలో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం
వెస్ట్ మారేడ్ పల్లిలో 6.1 సెంటీమీటర్లు
బంసిలాల్ పేటలో 6.7 సెంటీమీటర్లు..
గోషామహల్, బాలానగర్ లో 5.4 సెంటీమీటర్లు
బేగంపేటలోని పాటిగడ్డలో 4.9 సెంటీమీటర్లు
అల్వాల్‌లో 5.9 సెంటీమీటర్లు
ఎల్బీ నగర్ లో 5.8 సెంటీమీటర్లు..
ఏఎస్ రావు నగర్‌లో 5.1 సెంటిమీటర్లు
సరూర్ నగర్, ఫలక్‌నామా లో 4.6 సెంటీమీటర్లు
మల్కాజిగిరిలో 4.7 సెంటీమీటర్లు
గుడిమల్కాపూర్, నాచారంలో 4.1 సెంటీమీటర్
కాచిగూడ, సికింద్రాబాద్ లో 4.3 సెంటీమీటర్లు
గన్ ఫౌండ్రీలో 4.4 సెంటీమీటర్లు
అంబర్‌పేటలో 4 సెంటీమీటర్లు
చార్మినార్‌లో 4.2 సెంటీమీటర్లు
అమీర్‌పేట, సంతోష్ నగర్‌లో 3.7 సెంటీమీటర్లు
ఖైరతాబాద్‌లో 3.6 సెంటీమీటర్లు..
బేగంబజార్, హయత్ నగర్ చిలకనగర్లలలో 3.5 సెంటీమీటర్ల మేర తాజా వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ఏపీ, తెలంగాణ సహా ఇతర సెక్షన్స్‌లో మరిన్ని లేటెస్ట్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి