ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను పోలీసులు హౌస్‌అరెస్టు చేశారు. తెలంగాణ డీజీపీని కలిసేందుకు వెళ్లేందుకు యత్నించిన ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. 


ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి లేదని కేఏ పాల్‌కు పోలీసులు సూచించారు. హౌస్‌ అరెస్టు చేశామని... బయట కాలుపెట్టేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ఉదయం నుంచి కేఏపాల్‌ను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. 


రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న తనపై టీఆర్‌ఎస్ లీడర్లు దాడి చేశారని.. దీనిపై తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తామన్నారు కేఏ పాల్. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఏకేపాల్ బయటకు రాకుండా నిర్బంధించారు. పర్యటనకు, బయటకు వెళ్లేందుకు అనుమతి లేదని ఆయనకు సమాచారం ఇచ్చారు. తనపై దాడి జరిగిందని.. ఆ విషయంపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని చెప్పినా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. 


రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులను పరామర్శించేందుకు వెళ్తుండగా పాల్‌పై టీఆర్‌ఎస్‌ లీడర్ దాడి చేశారు. సిద్దిపేట జిల్లా జక్కపూర్‌ గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. పర్యటనపై పోలీసులతో మాట్లాడుతున్న టైంలో అనిల్ అనే వ్యక్తి దాడి చేశారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపింది. ఆయన మద్దతుదారులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల్ కూడా ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. బాధితులను పరామర్శిస్తుంటే ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. తనను అడ్డుకున్న పోలీసులపై కూడా రుసరుసలాడారు పాల్. వీటన్నింటిపైనే డీజీపీకి ఫిర్యాదు చేయడానికి వెళ్లేందుకు సిద్ధమైన పాల్‌ను హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. 


హౌస్ అరెస్టుపై పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కావలనే బయటకు రానివ్వడం లేదమని మండిపడ్డారు. తాను ప్రజల్లోకి వెళ్తే నిజాలు తెలిసిపోతాయని దాడులు చేయిస్తున్నారు... పోలీసులతో గృహనిర్బంధం చేశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు 20 సీట్లకు మించి రావన్నారు. అందుకే ప్రశాంత్ కిషోర్‌ను పెట్టుకున్నారని విమర్శించారు. ఆయనతో పాార్టీ కూడా కేసీఆర్ పెట్టించారని ఆరోపించారు.