భార్యాభర్తలు కలిసి స్థానికులను నిలువునా ముంచిన మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. చిట్‌ల పేరుతో ఈ కిలాడీ భార్యాభర్తలు ఘరానా మోసానికి పాల్పడ్డారు. వీరి బాధితులు సుమారు 120 మంది ఉన్నారు. వీరందరికీ కుచ్చుటోపీ పెట్టి ఏకంగా రూ.2.5 కోట్లతో రాత్రికి రాత్రే ఇళ్లు ఖాళీ చేసి పారిపోయారు. హైదరాబాద్‌లోని దుండిగల్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ భారీ మోసం వెలుగు చూసింది. దుండిగల్ పోలీసులు, బాధితులు వెల్లడించిన వివరాలు ఇవీ.. 


జీడిమెట్ల సమీపంలోని సూరారం కాలనీ రాజీవ్‌ గృహకల్ప సమీపంలోని 60 గజాల కాలనీలో ఎం.విజయ్‌కుమార్‌, పద్మ అనే భార్య భర్తలు నివాసం ఉంటున్నారు. దాదాపు 20 ఏళ్లుగా వీరు ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అయితే, చాలా ఏళ్లుగా ఇక్కడే స్థిరపడి ఉండడంతో వీరికి స్థానికులతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. స్థానికంగా పెద్ద మనుషులుగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆ నమ్మకంతోనే గత 15 సంవత్సరాలుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. వీరిపై అందరికీ సదభిప్రాయం ఉండడంతో స్థానికులు కూడా నమ్మి వారి వద్ద చిట్‌లు వేసేవారు.


Also Read: Statue Of Equality: నేడు ముచ్చింతల్ రామానుజ ఆశ్రమాన్ని సందర్శించనున్న సీఎం జగన్, ఇవాళ వెళ్లిన పవన్ కల్యాణ్


ఉన్నట్టుండి వారం రోజుల క్రితం ఈ భార్యాభర్తలు గుట్టుచప్పుగు కాకుండా రాత్రికి రాత్రే డబ్బుతో సహా ఇల్లు వదిలి ఖాళీ చేసి పారిపోయారు. అంతేకాకుండా, శుభకార్యానికి వెళ్తున్నామని చెప్పి పక్కింటి మహిళ వద్ద నగలు తీసుకుంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న బాధితులు కంగుతిన్నారు. కష్టార్జితం మొత్తం చిట్‌లు వేసి కాపాడుకుంటే ఇలా జరిగిందంటూ బాధితులు ఆవేదన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆదివారం పెద్ద ఎత్తున నిందితుల ఇంటి వద్దకు చేరుకొని బాధితులు నిరసన చేశారు. ఈ బాధితుల్లో కొంత మంది దుండిగల్‌ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విచారణ మొదలుపెట్టారు. నిందితులైన భార్యాభర్తల ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


ఇలా చిట్‌‌ల పేరుతో బాధితులను ముంచి నిందితులు పరారైన ఘటనలు గతంలో లెక్కలేనన్ని జరిగాయి. అయినా జనం వారిని నమ్మి ఇంకా మోసపోతూనే ఉన్నారు. గతేడాది డిసెంబరులో విశాఖపట్నం జిల్లా బుచ్చయ్య పేటలోనూ ఇలాంటి ఘోరమే జరిగింది. వారు ఏకంగా రూ.5 కోట్లకు పంగనామం పెట్టి పారిపోయారు.


Also Read: TRS News: చీప్ ట్రిక్స్, తప్పుడు రాజకీయాలు మానుకోండి.. ఆధారాలతో బీజేపీకి టీఆర్ఎస్ కౌంటర్